మచిలీపట్నం: తీవ్ర ఉద్రిక్తత నడుమ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మచిలీపట్నంలో పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్తున్న కొల్లు రవీంద్రను 25వ పోలింగ్ బూత్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు, రవీంద్రకు మధ్య వాగ్వాదం జరగింది. ఈ క్రమంలోనే పోలీసులను రవీంద్ర తోసేయగా వారు కూడా ఆయనను తోశారు.  దీంతో పోలీసుల తీరుకు నిరసనగా రవీంద్ర అక్కడే నేల మీద కూర్చొని నిరసన తెలిపారు. 

అయితే గురువారం ఉదయం రవీంద్ర ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు అయనను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. ఎన్నికల విధులకు ఆటంకం కల్పించారని ఆయనను అదుపులోకి తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.  

అయితే వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. గురువారం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బయటకు వెళ్లగా వైసీపీ వారే దురుసుగా ప్రవర్తించారని... అంతేకాకుండా మీడియాతో మాట్లాడనివ్వకుండా పోలీసులు ఇబ్బందులు పెట్టారన్నారు.

read more   టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

''గురువారం ఉదయమే ఎక్కడికి వెళ్ళడానికి లేదని హౌస్ అరెస్ట్ అని చెపితే నేను ఇంట్లోనే ఉన్నాను. కేవలం ఓటు వేయడానికే బయటకు రాగా సంబంధం లేని వాటిల్లో నన్ను ఇరికించి కావాలని కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు.  ప్రజాస్వామ్యం ఏమౌతుందో అర్ధం కావడం లేదు. శివరాత్రి రోజున నది స్నానానికి వెళ్లి పితృదేవతలకు పూజ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''మంత్రి పేర్ని నాని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు....అందుకే నాపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. నిన్నటి ఘటనపై పోలీసులు వివరణ అడిగితే నేనే స్టేషన్ కు వచ్చి సమాధానం చెప్పే వాడిని.తెల్లవారుజాము నుంచి పోలీసులు ఇంటిని చుట్టూ ముట్టి ఎవ్వరిని రానివ్వకుండా చేశారు'' అన్నారు.

''అరెస్టులు శాశ్వతం కాదు...పోలీసులతో పాలన చేయాలి అనుకుంటే ముఖ్యమంత్రి జగన్ ఎక్కువ రోజులు ఉండరు. మాపై చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాము. కేసులు పెట్టి తాత్కాలికంగా ఇబ్బందులు పెడుతున్నారు... రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో గుర్తు పెట్టుకోవాలి. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం'' అని రవీంద్ర తెలిపారు.