మచిలీపట్నం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయనను అరెస్టు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం ఆయనను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి 

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కొల్లు రవీంద్ర బుధవారంనాడు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆయనకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 

పోలీసులను రవీంద్ర తోసేశారు. దాంతో వారు ఆయనను పక్కకు తోసేశారు. పోలీసుల చర్యకు నిరసనగా ఆయన రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని వారు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.

కొల్లు రవీంద్ర అరెస్టుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైసీపీ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. పోలీసులతో పాలన సాగించాలనుకుంటే ఎక్కువ కాలం నిలువలేరని ఆయన అన్నారు.