గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ పై జరిగిన కోడికత్తి కేసు విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
విజయవాడ : ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత ఎన్నికల సమయంలో జరిగిన కోడి కత్తి దాడి విచారణపై విజయవాడ ఎన్ఐఏ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు విజయవాడ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
వీడియో
2018 అక్టోబరు 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కోడిపందాలకు ఉపయోగించే చిన్న కత్తితో శ్రీనివాస్‌రావు అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో వైఎస్ జగన్ చేతికి గాయమై హాస్పిటల్లో చేరారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసును రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థలపై తనకు నమ్మకం లేదంటూ జగన్ మోహన్ రెడ్డి తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి నిరాకరించారు.
అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి, ఈ కేసుపై కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరింది. కోర్టు ఆదేశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ 31వ తేదీన ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించింది. జనవరి 1, 2019న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అప్పటినుండి ఈ కోడి కత్తి కేసు విచారణ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది.
Read More రాయపాటి సాంబశివరావు ఇంటికి ఈడి బృందం... తెల్లవారుజామునుండే సోదాలు (వీడియో)
అయితే తాజాగా ఈ కేసుపై ఇవాళ విచారణ జరిపిన విజయవాడ కోర్టు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీచేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 8కి వాయిదా వేసింది. తదుపరి విచారణ మొత్తం ఇక విశాఖ ఎన్ఐఏ కోర్టులో సాగనుంది.
విజయవాడ కోర్టు నిర్ణయంపై నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది గగన సింధు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. సులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమన్నారు. అయితే ఈ కేసును తేలిగ్గా వదిలేసేదే లేదు... ఎక్కడైనా తమ వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామన్నారు. కేసు కొలిక్కి రావాలంటే ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని న్యాయవాది సింధు అభిప్రాయపడ్డారు.
