అమరావతి: ప్రజలు చంద్రబాబును ఇప్పటికే రాజకీయాలకు దూరం చేశారని ఇంకా కొత్తగా రాజకీయాలకు దూరం చేయాల్సిన అవసరం లేదని  ఏపీ మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు.


గురువారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ కు ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. 

లోకేష్ ను  ప్రజలు మంగళగిరిలో పాతాళానికి తొక్కారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఇదే గతి పడుతోందన్నారు.

మహిళా రైతులు ఆందోళన చేస్తుంటే చంద్రబాబుకు ఏం పని అని ఆయన ప్రశ్నించారు. తోకపార్టీలను వేసుకొని డ్రామాలు ఆడుతున్నారని బాబుపై కొడాలి నాని మండిపడ్డారు.

చంద్రబాబు ఏం చేశారని జగన్ ను అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ కు పాల్పడిన అందరి పేర్లు బయటపెట్టామని ఆయన గుర్తు చేశారు. 

దమ్ముంటే మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ విసిరారు.చంద్రబాబు వెనకాల ఉన్న వ్యవస్థలపై కూడ ఫిర్యాదులు వెళ్లాయి. వాటిపై కూడా విచారణ జరుగుతుందన్నారు. 

also read:విశాఖలోనే ఇన్‌సైడర్ ట్రేడింగ్, నిరూపిస్తా: చంద్రబాబు

చంద్రబాబును నడిరోడ్డుపై ఈడ్చే రోజు త్వరలోనే వస్తోందని ఆయన చెప్పారు. రాజధాని వస్తోందని రైతులకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని వస్తోందని నీకు, నీ అనుచరులకు తెలుసునని  ఈ విషయం రైతులకు తెలుసా అని అడిగారు.

మనసుంటే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడుస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు.  వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలను  తన వైపునకు తిప్పుకొని ఒకసారి విపక్ష నేతగా మరోసారి అధికారంలోకి వచ్చిన జగన్  చరిత్ర అని ఆయన చెప్పారు.