ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తాను బీజేపీలో చేరినట్లు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

విజయవాడ: ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తాను బీజేపీలో చేరినట్లు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. జాతీయ నాయకత్వం సూచనలు, సలహాల మేరకు ఏ ప్రాంతం నుంచైనా పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను పోటీ చేయాలా లేదా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరిన తర్వాత బుధవారం రోజున తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన కిరణ్ కుమార్ కుమార్ రెడ్డికి విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

విజయవాడలో కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధిష్ఠానం అస్తవ్యస్త నిర్ణయాలతోనే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారడానికి ఆ పార్టీ హైకమాండ్ మాత్రమే కారణమని ఆరోపించచారు. తనను ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తామంటూ ఏఐసీసీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. నీళ్ల సీసా పూర్తిగా పగలకముందే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుని ఉండాల్సిందని.. పగిలిన సీసాలో నీరు నింపడం కష్టమని అన్నారు. ఇదే విషయాన్ని తాను వారికి చెప్పానని తెలిపారు. 

తాను హైదరాబాద్‌లో పుట్టి పెరిగానని, చిత్తూరు జిల్లా నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తన తండ్రి కూడా ఎమ్మెల్యే అని, మంత్రిగా కూడా పనిచేశారని గుర్తుచేశారు. బెంగళూరులో తనకు బంగ్లా ఉందని అన్నారు. తాను ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాలకు చెందినవాడిని అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చి బీజేపీలో చేరినట్టుగా చెప్పారు. బీజేపీ అధిష్టానం ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తానని తెలిపారు.

పదవులకన్నా పార్టీ సభ్యత్వాన్ని ఆశించే బీజేపీలో చేరానని చెప్పారు. టీడీపీలో ఉన్న తన సోదరుడితో తనకు ఎలాంటి సంబంధాలూ లేవని అన్నారు. వాయిల్పాడుకు వెళితే తమ్ముడి ఇంటికి కూడా వెళ్లకుండా సొంత గెస్ట్‌ హౌస్ ఉంటానని తెలిపారు. రాజధానిపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత కేంద్రం గ్రాంట్లు రెట్టింపు అయ్యాయని అన్నారు. తానెప్పుడూ అధికారం కోసమో, పదవి కోసమో పని చేయలేదని చెప్పారు.