Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లోకి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, రాహుల్‌తో భేటీ?

కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy's Re-entry In Congress

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని  సమాచారం.కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన  కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కిర‌ణ్‌కుమార్ రెడ్డిని  కాంగ్రెస్ పార్టీలోకి  రప్పించే బాధ్యతను  మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుకు  అప్పగించారు.

2014 ఎన్నికల ముందు  కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన  నేతలు తిరిగి పార్టీలోకి రప్పించేందుకుగాను  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  చర్యలు తీసుకొంటుంది.  ఈ మేరకు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హార్షకుమార్‌,  మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిలను  కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ ఉమెన్ చాందీ ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆదేశించారు.

మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో  చర్చలు జరిపే బాధ్యతను మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజుకు అప్పగించారు. 2014 ఎన్నికల తర్వాత క్రియాశీలక రాజకీయాలకు మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు.

అయితే 2014 తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడ కొంతకాలం సాగింది. అయితే ఆయన ఏ పార్టీలో కూడ చేరలేదు. ఇటీవలనే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి సంతోష్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరారు. చిత్తూరు జిల్లాలో టిడిపిని బలోపేతం చేసేందుకు గాను  సంతోష్ కుమార్ రెడ్డిని టిడిపిలోకి తీసుకొన్నారు.చిత్తూరులో వైసీపీని ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు సంతోష్ కుమార్ రెడ్డిని వ్యూహాత్మకంగా టిడిపి తమ పార్టీలోకి చేర్చుకొంది. మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సంతోష్ కుమార్ రెడ్డిని టిడిపిలోకి రప్పించేందుకు చేసిన కృషి ఫలించింది.

అయితే ఇదిలా ఉంటే నాలుగేళ్ళుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారని సమాచారం.ఈ మేరకు ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందనే విషయమై ఆయన తన సన్నిహితులతో చర్చించారనే ప్రచారం కూడ లేకపోలేదు.

అయితే కాంగ్రెస్ పార్టీలోనే కిరణ్ కుమార్ రెడ్డి చేరేందుకు ఒకింత మొగ్గుచూపినట్టు సమాచారం. తమ స్వగ్రామానికి చెందిన తన సన్నిహితులు, మిత్రులు, అనుచరులతో కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయమై చర్చించారని సమాచారం. 

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడ కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు  కిరణ్‌తో చర్చించే అవకాశం ఉంది.మరోవైపు  కాంగ్రెస్ పార్టీలోకి కిరణ్‌కుమార్ రెడ్డి చేరితే పార్టీలో కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం కూడ లేకపోలేదని పార్టీలో ప్రచారం సాగుతోంది. 

అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కిరణ్‌కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ లాంటి పదవిని అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయాలపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.  కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కూడ ఆయనకు సూచించారని కిరణ్ సన్నిహితుల్లో ప్రచారంలో ఉంది.

కిరణ్‌కుమార్ రెడ్డి తన రాజకీయ గురువుగా మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరాన్ని భావిస్తున్నారని వారు చెబుతున్నారు. మరో వైపు  ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కూడ కిరణ్‌కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో సమావేశమయ్యారని  ప్రచారం కూడ సాగుతోంది. 

కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే  ఆయన  సోదరుడు సంతోష్‌కుమార్ రెడ్డి పరిస్థితి ఏమిటి సోదరులు చేరో పార్టీలో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయనే చర్చ కూడ లేకపోలేదు. 

గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో  సంతోష్‌కుమార్ రెడ్డి నియోజకవర్గంతో పాటు, జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహారించారు.అయితే కిరణ్‌ కాంగ్రెస్ పార్టీలో చేరితే  ఆయనకు కీలకమైన బాధ్యతలను అప్పగించే విషయంలో సంతోష్‌కుమార్ రెడ్డి టిడిపిలో ఉండడం కొంత నష్టం కల్గించే అవకాశం కూడ లేకపోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.  అయితే  కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి  వచ్చే విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios