Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల్లోకి రాను .. పదిహేనుళ్లుగా ఇదే ప్రచారం: బెజవాడ నుంచి పోటీపై తేల్చేసిన నాగార్జున

తాను రాజకీయాల్లోకి ప్రవేశించి విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్ధిగా లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతానంటూ జరుగుతున్న ప్రచారంపై టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున స్పందించారు. తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదన్నారు. 
 

king nagarjuna reaction on his political entry
Author
First Published Sep 30, 2022, 5:30 PM IST

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున ఖండించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని.. విజయవాడ ఎంపీగా పోటీ చేయనని నాగ్ తేల్చిచెప్పారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాగే ప్రచారం చేస్తున్నారని నాగార్జున మండిపడ్డారు. రాజకీయాలకు దూరంగా వున్నానని.. కానీ మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్‌గా నటిస్తానని కింగ్ స్పష్టం చేశారు. 

కాగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ స్థానాలను గెలిచి సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. అయితే రాష్ట్ర రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో వున్న విజయవాడ ఎంపీ స్థానంలో మాత్రం వైసీపీ జెండా ఎగరలేదు. కమ్మ సామాజిక వర్గానికి పెట్టని కోటగా వున్న ఈ స్థానంలో 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి కేశినేని నాని గెలుస్తూ వస్తున్నారు. రెండు దఫాలుగా ఓడిపోయిన ఈ సీట్లో ఎలాగైనా సరే ఈసారి గెలవాలని సీఎం జగన్ గట్టి పట్టుదలగా వున్నారు. 

ALso REad:మొన్న నాగార్జున.. నిన్న చిరంజీవి గట్టిప్లానే వేశారుగా, అనుకుని చేశారా..? లేక యాదౄచికమా..?

విజయవాడ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం అధికం. పార్టీ ఏదైనా కానీ.. గెలిచే వ్యక్తి మాత్రం ఆ వర్గానికి చెందినవారే అయ్యుంటారు. ఈ నేపథ్యంలోనే కేశినేనికి పోటీ ఇచ్చేందుకు సరైన కమ్మ వ్యక్తి కోసం జగన్ అన్వేషిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన చూపు సినీ హీరో నాగార్జునపై పడింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు సినీ నటుడిగా నాగ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. పైగా కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తే కావడం మరో ప్లస్ పాయింట్. 

మరోవైపు వైఎస్ కుటుంబంతో నాగార్జునకు తొలి నుంచి మంచి అనుబంధం వుంది. పైగా నాగార్జున మేనల్లుడు సుమంత్ స్వయంగా జగన్‌కి క్లాస్‌మేట్. దీనికి తోడు నాగార్జున- జగన్ మధ్య వ్యాపార సంబంధాలు కూడా వున్నాయని అంటూ వుంటారు. ఈ సాన్నిహిత్యంతోనే జగన్ అడిగితే నాగార్జున కాదనరు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్ధిగా నాగార్జున బరిలో నిలుస్తారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఘోస్ట్ మూవీ ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాగార్జున తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios