దసరా తర్వాత డాక్యుమెంట్లు తెస్తా: సీఐడీకి కిలారు రాజేష్ లేఖ
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అడిగిన డాక్యుమెంట్లను దసరా తర్వాత తెస్తానని లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ లేఖ రాశారు.
అమరావతి: దసరా తర్వాత అన్ని డాక్యుమెంట్లను తీసుకు వస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సన్నిహితుడు కిలారు రాజేష్ మంగళవారంనాడు సీఐడీకి లేఖ రాశారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ విచారణకు సోమవారంనాడు కిలారు రాజేష్ హాజరయ్యారు. సుమారు ఆరు గంటల పాటు ఏపీ సీఐడీ అధికారులు రాేష్ ను విచారించారు. పలు విషయాలపై ఆయనను ప్రశ్నించారు.
అయితే ఇవాళ కూడ రాజేష్ ను విచారణకు రావాలని సీఐడీ అధికారులు రాజేష్ ను కోరారు. విచారణకు వచ్చే సమయంలో కొన్ని డాక్యుమెంట్లు తీసుకురావాలని సూచించారు. అయితే ఇవాళ ఉదయం పది గంటల వరకు డాక్యుమెంట్లతో విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆదేశించడంతో రాజేష్ ఈ లేఖ రాశారు. సీఐడీ కోరిన డాక్యుమెంట్లు తీసుకురావడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దసరా తర్వాత సీఐడీ కోరిన డాక్యుమెంట్లను తీసుకు వస్తానని ఆ లేఖలో రాజేష్ పేర్కొన్నారు.
also read:చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక: ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల పిటిషన్
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్టులో కిలారు రాజేష్ పేరును ఏపీ సీఐడీ అధికారులు ప్రస్తావించారు. కిలారు రాజేష్ ఇటీవల ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ సమయంలో స్కిల్ కేసులో రాజేష్ ను నిందితుడిగా చేర్చలేదని సీఐడీ తరపు న్యాయవాడి కోర్టుకు తెలిపారు. ఒకవేళ నిందితుడిగా చేర్చితే 41 ఏ ప్రకారం నోటీసు ఇచ్చి ప్రశ్నిస్తామని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను ఈ నెల 14న ముగించింది. ఈ నెల 16న విచారణకు రావాలని సీఐడీ కిలారు రాజేష్ కు నోటీసు జారీ చేసింది. దీంతో రాజేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు.