ఏపీ మంత్రి పరిటాల సునీత కు కొత్త తలనొప్పులు పుట్టుకొచ్చాయి. 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆమె అనుచరులపై కిడ్నాప్ కేసు ఒకటి నమోదైంది. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరుల రౌడీయిజం మితిమీరిపోయిందనే వార్తలు వినపడుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని పరిటాల అనుచరులు కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఉండే సయ్యద్‌ పాషాను పరిటాల వర్గం కిడ్నాప్‌ చేసి, మంత్రి స్వగ్రామమైన వెంకటాపురానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు.

రూ. 4 కోట్లు ఇవ్వాలని బెదిరించి, బాధితుడి బ్యాంక్‌ అకౌంట్ నుంచి రూ. 30 లక్షలు తీసుకుని అతడిని విడిచిపెట్టారు. దీంతో సయ్యద్‌ పాషా కర్ణాటకలోని బాగేపల్లిలో పోలీసులును అశ్రయించాడు. పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ అనుచరుడు భాస్కర్‌ నాయుడు సహా 8 మందిపై చర్యలు తీసుకోవాలని అతను ఫిర్యాదు చేశాడు. కర్ణాటక పోలీసులు ఈ కేసును అనంతపురం ఫోర్త్‌ టౌన్‌ పీఎస్‌కు బదిలీ చేశారు.

పరిటాల వర్గీయులు ఆగడాలు పెచ్చుమీరుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిటాల వర్గీయుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు.