అమరావతి: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందంటూ గల్లా జయదేవ్ చేసిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి ఇలాంటి అవాస్తవాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

కియా మోటార్స్ ప్లాంట్ రాష్ట్రంలోనే ఉంటుందని ఆ సంస్థ ఎండీ స్పష్టం చేసిన ట్విట్టర్ వేదికగా మిథున్ రెడ్డి జయదేవ్ కు గుర్తు చేశారు. టీడీపీ లోకసభ వేదికగా చేసిన దుష్ప్రచారానకిి ఇదే సమాధానమంటూ తన వ్యాఖ్యకు కియా ఎండీ చేసిన ప్రకటనకు సంబంధించిన వార్తాకథనాన్ని జోడించారు. 

"నీ తలపై జట్టు మాత్రమే లేదనుకున్నా. కానీ బుర్ర కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. ఏపీలో ఉన్న పెట్టుబడిదారులను తరిమేయాలని ఎందుకంత తొందర మీకు. ఎవరు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారో ఇప్పటికైనా అర్థమైందా?" అని మిథున్ రెడ్డి అన్నారు.

"కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోవడం లేదని ఆ సంస్థ సమాధానం ఇచ్చింది. ఒక ఎంపీగా ఉండి అసత్యాలు ప్రచారం చేస్తావా, అయినా నీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం?" అని కూడా ఆయన అన్నారు.