ఒకవేళ నిజంగానే భాజపా విడిగా పోటీ చేస్తే నాని కమలం పార్టీ నుండి పోటీ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. భాజపాకు కూడా నాని లాంటి వాళ్ళ అవసరం ఎటూ ఉంది. అదే సమయంలో నాని జనసేన ముఖ్యులతో కూడా టచ్ లో ఉంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
విజయవాడ ఎంపి కేశినేని నాని వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆధిపత్య పోరాటాల కారణంగా ఎంపి పార్టీలో ఇమడలేకపోతున్నారా? పార్టీ వర్గాలు అవుననే సమాధానం వినబడుతోంది. పదే పదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపి వ్యాఖ్యలు చేస్తుండటంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. మంత్రివర్గంలోని కీలక వ్యక్తితో నానికి ఏమాత్రం పడటం లేదట. వీరిద్దరి మధ్య మొదలైన ఆధిపత్య పోరాటాలతో పార్టీలో కూడా చీలిక వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో నాని స్ధానంలో వేరే ఎవరినైనా ఎంపిగా పోటీ చేయాలన్నది సదరు కీలక నేత వ్యూహంగా తెలుస్తోంది. అందుకు పరోక్షంగా చంద్రబాబునాయుడు మద్దతు కూడా ఉందట. ఈ విషయాలు తెలిసే నానిలో అసహనం మొదలైందట. అదే సమయంలో విజయవాడ రాజధాని ప్రాంతమైపోవటంతో ఇక్కడి నుండి పోటి చేయటానికి పార్టీలోని నేతలతో పాటు బయట వ్యక్తుల నుండి కూడా చంద్రబాబునాయుడుపై బాగా ఒత్తిడి మొదలైందట.
జరుగుతున్న విషయాలను గమనిస్తున్న నాని తనదారి తాను చూసుకోవాలన్న నిర్ణయానికి నాని కూడా వచ్చారట. అందులో భాగంగానే ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. మొదటి నుండి కూడా కేశినేని-చంద్రబాబు మధ్య అంత సయోధ్య అయితే లేదన్నది పార్టీ నేతల మాట. పోయిన ఎన్నికల్లో విజయవాడలో పోటీ చేసే అవకాశం ఇవ్వటమే చంద్రబాబుకు ఇష్టం లేదట. అయితే, అప్పటి పరిస్ధితుల కారణంగా నానికి టిక్కెట్టు ఇవ్వక తప్పలేదు. దానికితోడు నాని మొదటి నుండి భాజపాకు దగ్గరగా ఉంటున్నారన్న ప్రచారం కూడా పార్టీలోనే జరుగుతోంది.
ఒకవేళ నిజంగానే భాజపా విడిగా పోటీ చేస్తే నాని కమలం పార్టీ నుండి పోటీ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. భాజపాకు కూడా నాని లాంటి వాళ్ళ అవసరం ఎటూ ఉంది. అదే సమయంలో నాని జనసేన ముఖ్యులతో కూడా టచ్ లో ఉంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దాంతో నాని కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందు జాగ్రత్త పడటంలో భాగంగానే ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా? చూడాలి మరి ఏం జరుగుతుందో?
