Asianet News TeluguAsianet News Telugu

కేఈ వర్సెస్ కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి ఫిక్స్, టీజీ మెలిక

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన కుటుంబానికి కర్నూలు లోకసభ సీటుతో పాటు డోన్, ఆలూరు, పత్తికొండ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాక డిప్యూటీ సిఎం కేఈ కుటుంబ సభ్యులకు నచ్చడం లేదు.

KE vs Kotla: SV Mohan Reddy in fix
Author
Kurnool, First Published Feb 7, 2019, 4:53 PM IST

కర్నూలు: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో నాలుగు స్తంభాలాట నడుస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం కాంగ్రెసును వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో ఒకరిపై మరొకరు పైచేయి సాధించే రాజకీయాలను నడిపిస్తున్నారు. 

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన కుటుంబానికి కర్నూలు లోకసభ సీటుతో పాటు డోన్, ఆలూరు, పత్తికొండ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాక డిప్యూటీ సిఎం కేఈ కుటుంబ సభ్యులకు నచ్చడం లేదు. కేఈ కృష్ణమూర్తితో పాటు కేఈ ప్రభాకర్ ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసినప్పటికీ సమస్య కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు.

డోన్ సీటును కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన సతీమణి కోట్ల సుజాత కోసం అడుగుతున్నారు. అయితే, డోన్ సీటును వదులుకోవడానికి కేఈ కుటుంబ సభ్యులు సిద్ధంగా లేరు. డోన్ సీటు తమకే దక్కుతుందనే నమ్మకాన్ని చంద్రబాబుతో భేటీ తర్వాత కేఈ ప్రభాకర్ వ్యక్తం చేశారు. 

డోన్ సీటు ఇవ్వడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు అంగీకరించకపోవడం వల్లనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వైసిపిలోకి కాకుండా తెలుగుదేశం పార్టీలోకి రావాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇక్కడ కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కేఈ కుటుంబం నుంచి వ్యతిరేకతనే ఎదురవుతోంది. 

అయితే, ఈ పరిణామాన్ని కేఈ బ్రదర్స్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డికి చెక్ పెట్డడం ద్వారా తమ ప్రయోజనాలు నెరవేరుతాయనే ఉద్దేశంతో వారున్నట్లు తెలుస్తోంది. కర్నూలు సీటును సుజాతకు కేటాయించి, తమకు డోన్ సీటు ఇవ్వాలని వారు కేఈ బ్రదర్స్ చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. కర్నూలు లోకసభ స్థానాన్ని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చినా ఫరవాలేదని వారన్నట్లు తెలుస్తోంది. అయితే డోన్, పత్తికొండ సీట్లను వదులుకోవడానికి వారు సిద్ధంగా లేరని సమాచారం. 

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి స్వాగతిస్తూ ఎస్వీ మోహన్ రెడ్డి తొలుత ప్రకటన చేశారు. దీంతో ఎస్వీ మోహన్ రెడ్డితో కేఈ బ్రదర్స్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సుజాతను తెర మీదికి తేవడం ద్వారా ఎస్వీ మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

కాగా, కర్నూలు శాసనసభ సీటును పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేష్ తన కుమారుడు భరత్ కు ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. మొత్తం మీద కర్నూలు తెలుగుదేశం పార్టీ సమస్యను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios