అమరావతి: ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని విలీనం చేయవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 

కార్మికులకు ఇంధనం పొదుపు, భద్రత అవార్డులు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారని, చాలా పొరపాటు చేస్తున్నావని జగన్ కు కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు.

ఆర్టీసీ కార్మికుల వేతనాలను భరించడం గుదిబండ అవుతుందని కేసీఆర్ జగన్ కు చెప్పినట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలను జగన్ సవాల్ గా తీసుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని ఆయన చెప్పారు. కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం తప్పని భావిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. 

ప్రభుత్వం, తాను చేస్తున్న పనుల్లో తప్పులున్నాయని నిరూపిస్తే క్షమాపణ చెబుతానని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు విశ్వాసం ఉంచాలని ఆయన చెప్పారు. సీపీఎస్ రద్దు, ఆర్టీసీ కార్మికులుక పింఛను వంటి డిమాండ్లను సీఎం జగన్ తీరుస్తారని ఆయన హామీ ఇచ్చారు.