తిరుపతి: లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ దేశానికి అవసరమని, అందుకు చంద్రబాబు, కేసీఆర్, జగన్ ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన  మీడియాతో మాట్లాడారు. 

మే 23వ తేదీ తర్వాత నరేంద్ర ప్రధాని నరేంద్ర మోడీకి మూడు నామాలే మిగులుతాయని నారాయణ అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. నెలకు మేకప్‌ కోసం మోడీ రూ. 80 లక్షలు ఖర్చు చేస్తున్నారని ఆయన గుర్తు చేస్తూ అటువంటి  మోడీ చాయ్ వాలానా? అని ప్రశ్నించారు. పుల్వామాలో జవాన్లపై జరిగిన దాడి ప్రభుత్వ హత్యేనని నారాయణ ఆరోపించారు. నిఘా సంస్థలు హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్లే జవాన్లు ప్రాణాలు కోల్పోయారని అభిప్రాయపడ్డారు.
 
సీబీఐ, ఆర్బీఐ, సుప్రీంకోర్టులాంటి స్వయంప్రతిపత్తి గల సంస్థలను కేంద్ర ప్రభుత్వం నడిరోడ్డులో  దుస్తులు విప్పేసి నిలబెట్టిందని నారాయణ విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో అప్రకటితంగా కేంద్రమే పాలిస్తోందని అన్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత మోడీ ఇక సినిమాల్లో నటించాల్సిందేనని ఆయన అన్నారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎన్నికల్లో పోటీకి అనర్హురాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమెపై బహిష్కరణ వేటు వేయాలని డిమాండ్ చేశారు.
 
తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వ హత్యలేనని నారాయణ అన్నారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ఆయన స్పందించారు ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థులంతా తెలివైన వారని, అందరూ పేద విద్యార్థులేనని, విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారంగా ఇచ్చి ఆదుకోవాలని ఆయన అన్నారు.