కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీకి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం దక్కింది. వైసిపిలో చేరిన కొన్ని గంటల్లోనే సీటు దక్కించుకుని ఎన్నికలకు సిద్దమవుతున్నారు బిజెపి మాజీ ఎంపీ. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార వైసిపి అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేస్తూ రెండు జాబితాలు విడుదల చేసింది. కొందరు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత వున్నట్లు సర్వేల్లో తేలడంతో ఏమాత్రం ఆలోచించకుండా పక్కనపెట్టేస్తున్నారు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సమయంలోనే గెలిచే అవకాశాలున్న నాయకులు రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో వున్నా అవకాశం ఇస్తున్నారు. ఇలా తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఓ ఆసక్తికర అంశం కనిపించింది. కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీని ఇలా పార్టీలో చేర్చుకుని అలా అవకాశం ఇచ్చేసారు వైఎస్ జగన్. 

అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన జోలదరాశి శాంత 2009 లో కర్ణాటక నుండి ఎంపీగా పోటీచేసారు. అనంతపురం జిల్లా పక్కనే వున్న బళ్లారి లోక్ సభ నుండి శాంత పోటీచేసి గెలిచారు. ఇలా కర్ణాటక బిజెపి ఎంపీగా పనిచేసిన ఆమెను హిందూపురం లోక్ సభ బరిలో దింపాలని జగన్ నిర్ణయించారు. దీంతో శాంతను మంగళవారం ఉదయం పార్టీలో చేర్చుకుని సాయంత్రానికి హిందూపురం లోక్ సభ ఇంచార్జీగా ప్రకటించారు. 

Scroll to load tweet…

హిందూపురం సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరోసారి అవకాశం ఇచ్చేందుకు వైసిపి అధినేత విముఖత చూపించారు. దీంతో రాజకీయంగా మంచి పలుకుబడి కలిగిన శాంతను పార్టీలోకి ఆహ్వానించి హిందూపురం లోక్ సభ బాధ్యతలు అప్పగించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న శాంత ముఖ్యమంత్రిని కలిసారు. ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. ముందుగానే హిందూపురం ఎంపీ టికెట్ దక్కడంతోనే ఆమె వైసిపిలో చేరినట్లు సాయంత్రం వెలువడిన ఇంచార్జీల సెకండ్ లిస్ట్ ను చూస్తూ అర్థమయ్యింది. 

ఎవరీ శాంత? 

కర్ణాటకలోని బళ్ళారిలో తిప్పమ్మ-హొన్నూరమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో శాంత ఒకరు. ఈమె సోదరుడు బి.రాములు కర్ణాటక బిజెపిలో కీలక నాయకుడు. గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసారు. సోదరుడి సహాయంతో రాజకీయ నాయకురాలి మారిన శాంత గతంలో బళ్లారి ఎంపీగా పనిచేసారు. తాజాగా వైసిపిలో చేరి హిందూపురం ఎంపీగా పోటీకి సిద్దమయ్యారు జోలదరాశి శాంత. 

Also Read YSRCP : జగన్ రెడ్డిది సాహసమే... ఏకంగా 11మంది సిట్టింగ్ లను పక్కనపెట్టేసాడు, ఆ మంత్రితో సహా

గోరంట్ల మాధవ్ పై వేటుకు కారణమిదేనా?

సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డికి సవాల్ విసిరిమరీ గత లోక్ సభ ఎన్నికల వైసిపి తరపున బరిలోకి దిగారు గోరంట్ల మాధవ్. తన పోలీస్ ఉద్యోగాన్ని వదులుకుని హిందూపురం లోక్ సభ నుండి పోటీచేసి అనూహ్యంగా విజయం సాధించారు. అయితే ఎంపీగా అతడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి వైసిపికి తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఇటీవల ఓ మహిళతో మాధవ్ న్యూడ్ వీడియో ఒకటి బయటకు వచ్చి పెను దుమారం రేపింది. ఓ మహిళకు ఎంపీ నగ్నంగా వీడియో కాల్ చేసి వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ న్యూడ్ వీడియోతో గోరంట్ల ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఇదే ఇప్పుడు ఆయనకు మళ్ళీ వైసిపి సీటు దక్కకపోవడానికి కారణంగా తెలుస్తోంది.