విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గాజువాకలో పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు ఎదురు దెబ్బ తగిలింది. పవన్ కల్యాణ్ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలసిందే. గాజువాకకు చెందిన సీనియర్ నాయకుడు కరణం కనకా రావు బుధవారం జనసేనకు రాజీనామా చేశారు 

జనసేనకు రాజీనామా చేసిన ఆయన గాజువాక నియోజకవర్గం శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కనకారావును తిప్పల నాగిరెడ్డి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. 

కనకారావుతో పాటు 200 మంది జనసేన కార్యకర్తలు కూడా వైసీపిలో చేరారు. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నందుకు అసంతృప్తికి గురై ఆయన జనసేనకు రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం కాలేదు. ఎన్నికల తర్వాత జనసేన నుంచి పలువురు నాయకులు బయటకు వచ్చారు.