అప్పట్లో చిరంజీవి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మితిమీరిన జోక్యం, టిక్కెట్ల పంపిణీలో డబ్బులదే ప్రధాన పాత్రగా దితరాల కారణంగా ప్రజారాజ్యం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.పవన్ గనుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ప్రధానంగా ఆధారపడాల్సింది కాపు సామాజిక వర్గంపైనే. ఆ తర్వాత పవన్ వ్యవహార శైలిపైనే ఇతర సామాజిక వర్గాలు ఆయనకు దగ్గర కావటంపై ఆధారపడి ఉంటుంది. 

రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం సినీనటుడు పవన్ కల్యాణ వెంట నడుస్తుందా? ప్రస్తుతం ఈ విషయం మీదే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఎందుకంటే, ప్రత్యేహహోదా నినాదంతో ఈనెల 10వ తేదీన అనంతపురంలో పవన్ బహిరంగ సభ నిర్వహిచనున్నారు. ప్రత్యేకహోదా అంశంపైనే పవన్ బహిరంగ సభ జరుపుతున్నా దానికి ఇతరత్రా రాజకీయాలు కూడా తోడవుతుండటంతో భవిష్యత్ రాజకీయాలపైన కూడా పవన్ దృష్టి పెట్టే విషయమై చర్చ నడుస్తోంది.

గడచిన రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరును గమనిస్తే అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపైన వివిధ అంశాల్లో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. అలాగని వైసీపీ పనితీరు మీద ప్రజలు సానుకూలంగా ఉన్నారా అంటే అందుకు ఆధారాలు కూడా లేవు. మరి వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉండాల్సిందేనా ? ఆ పరిస్ధితులపైనే ఇపుడు చర్చ జరుగుతోంది. అధికార పార్టీపై ప్రజల్లో అసంతృప్తి, ప్రతిపక్షంలోని లోటుపాట్లపైనే పవన్ అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.

 రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న పవన్ వచ్చే ఎన్నకల నాటికి పూర్తిస్ధాయి రాజకీయల్లో కొనసాగాలని ప్రణాళికలు వేసుకుంటున్నట్లు ఆయన సన్నిహితుల ద్వరా తెలుస్తోంది. ఇక్కడే మరో అంశంపైన కూడా చర్చ జరుగుతోంది. అదే, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నాటి పరిస్ధితులు. అప్పట్లో చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించటం పెద్ద సంచలనమే.

 ఎప్పుడైతే చిరజీవి రాజకీయాల్లోకి ప్రవేశించారో వెంటనే కాపు సామాజిక వర్గం మొత్త మద్దతుగా నిలిచింది. ఎందుకంటే, కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీగాను, టిడిపి అంటే కమ్మ పార్టీగా ప్రజల్లో ముద్రపడటమే. తమకంటూ ప్రత్యేక పార్టీ లేని కారణంగానే అప్పటి వరకూ కాపులు ఏదో ఒక పార్టలో సర్దుకుపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గెలుపోటములను నిర్ణయించే స్ధాయిలో జనబలమున్నప్పటికీ జనామోదంలేని నేతలు కరువైన కారణంగానే ఒక పార్టీ అంటూ కాపు సామాజిక వర్గానికి లేదన్నది వాస్తవం.

 అటువంటి పరిస్ధితుల్లోనే చిరంజీవి ప్రజారాజ్యం స్ధాపించగానే అప్పటి వరకూ తామున్న పార్టీలను కాదని మెజారిటీ కాపు నేతలు ప్రజారాజ్యంలో చేరారు. అయితే, రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ప్రజారాజ్యం ఎన్నికల్లో తేలిపోయింది. చిరంజీవి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మితిమీరిన జోక్యం, టిక్కెట్ల పంపిణీలో డబ్బులదే ప్రధాన పాత్రగా వచ్చిన ఆరోపణలు, అభ్యర్ధుల ఎంపికలో పొరబాట్లు తదితరాల కారణంగా ప్రజారాజ్యం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో ప్రజారాజ్యం ఆరంభం, ముగింపు రెండు సంచలనంగా మారిపోయింది.

 అప్పటి పరిస్ధితులను గమనించిన వారు ఇపుడు జనసేనను అప్పటి ప్రజారాజ్యంతో పోల్చి చూస్తున్నారు. 2009 సంవత్సరం కన్నా ఇపుడు సామాజిక వర్గాల పరంగా రాష్ట్రం మరింత చీలిపోయిందన్నది వాస్తవం. ఇటువంటి పరిస్ధితుల్లో పవన్ గనుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ప్రధానంగా ఆధారపడాల్సింది కాపు సామాజిక వర్గంపైనే. ఆ తర్వాత పవన్ వ్యవహార శైలిపైనే ఇతర సామాజిక వర్గాలు ఆయనకు దగ్గర కావటంపై ఆధారపడి ఉంటుంది.

కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులు చంద్రబాబును కాదని పవన్ కు మద్దతు ఇచ్చేది దాదాపు అనుమానమే. ఇక, వైసీపీని కాదని రెడ్లు కూడా పవన్ కు అండగా నిలిచే విషయంలో స్పష్టత లేదు. పైగా చంద్రబాబు రాజకీయం ముందు కాపుల్లో కూడా గుండుగుత్తగా పవన్ కు ఎందరు మద్దతు పలుకుతారో అనుమానమే.

పవన్ తో ఎప్పటికైనా సమస్య వస్తుందన్న అనుమానం వల్లే చంద్రబాబు కాపుల్లో చీలిక తెచ్చేందేకు ప్రయత్నిస్తున్నట్లు కాపు నేతలే ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. ఇక, ముద్రగడ మద్దతుపైన కూడా పవన్ భవిష్యత్ కొంత ఆధారపడి ఉన్నట్లు సమాచారం. ఎవరికి మద్దతు ఇవ్వాలన్న సమస్య వస్తే ఇటు జగన్ లేదా అటు పవన్ కు మాత్రమే ముద్రగడ మద్దతుంటుందని కాపు నేతలు చెబుతున్నారు.

చిరంజీవి కారణంగా చేదును రుచి చూసిన కాపు నేతలు పవన్ కు మద్దతు పలకటం ద్వరా మళ్ళీ అదే తప్పును చేస్తారా అన్న విషయం కూడా చర్చ జరుగుతోంది. ఏదేమైనా యువతలోవపన్ కు చెప్పుకోతగ్గ ఫాలోయింగ్ ఉందన్నది తిరుగులేని వాస్తవం. మరి ఆ యువతలో ఎందరికి ఓట్లున్నాయి? ఎంతమంది ఇతరుల ఓట్లను జనసేన వైపుకు మార్చగలరన్న దానిపైనే జనసేన భవిష్యత్ ఆధారపడి ఉంటుందనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు..