జీవీఎల్ మాటల్లోని అర్థం ఇదేనా: బాబుకు కన్నా చుక్కులు చూపిస్తారా?

First Published 13, May 2018, 3:05 PM IST
Kanna Laxminarayana ardent political rival of Chandrababu
Highlights

చుక్కలు చూపిస్తామని కూడా ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. అందులో భాగంగానే బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణను నియమించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రచారమవుతోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తాయని, ఆ మార్పులకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధపడి ఉండాలని బిజెపి జాతీయాధ్యక్షుడు జీవిఎల్ నరసింహా రావు ఇటీవల అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆ మాటలన్నారనేది అందరికీ అర్థమైన విషయమే.

చుక్కలు చూపిస్తామని కూడా ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. అందులో భాగంగానే బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణను నియమించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రచారమవుతోంది.

తెలుగుదేశం పార్టీకి కన్నా లక్ష్మినారాయణ బద్ధ శత్రువు. ఆ బద్ధ శత్రుత్వమే చంద్రబాబును ధీటుగా ఎదుర్కోవడానికి పనికి వస్తుందని బిజెపి జాతీయ నాయకత్వం భావించి ఉండవచ్చు. పైగా, రాష్ట్రంలో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య వైరం ఉంటూ వచ్చింది. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం వల్ల అది కాస్తా సద్దుమణిగినట్లు అనిపించింది.

కానీ, లోలోపల ఇరు సామాజిక వర్గాల మధ్య వైరుధ్యం కొనసాగుతూనే ఉన్నది. చంద్రబాబుకు కన్నా లక్ష్మినారాయణ రాజకీయంగా ప్రత్యర్థి కూడా. దాన్ని వాడుకోవడానికి కన్నా లక్ష్మినారాయణ పనికి వస్తారని బహుశా బిజెపి జాతీయ నాయకత్వం భావించి ఉండవచ్చు. అంతేకాకుండా కన్నా లక్ష్మినారాయణకు రాజకీయంగా విశేషమైన అనుభవం ఉంది.

కన్నా ఐదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెసుకు రాజీనామా చేసి ఆయన 2014 అక్టోబర్ 27వ తేదీన అమిత్ షా నేతృత్వంలో బిజెపిలో చేరారు. 

కన్నా లక్ష్మినారాయణ 1955 ఆగస్టు 13వ తేదీన కన్నా రంగయ్య, కన్నా మస్తానమ్మ దంపతులకు గుంటూరు జిల్లా నాగారం పాలెం గ్రామంలో జన్మించారు. ఆయన మంచి వెయిట్ లిఫ్టర్ కూడా. 

loader