మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీలో ఆయనకు ఎలాంటి పాత్ర దక్కనుంది, కన్నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న ఆయన టీడీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీలో ఆయన స్థానం ఏంటీ.. తెలుగుదేశం హైకమాండ్ కన్నాకు ఎలాంటి స్థానం కట్టబెడుతుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..పార్టీలో తన స్థానం ఏంటనే దానిపై అధినేత నిర్ణయంపై ఆధారపడి వుంటుందన్నారు. ఆయన సూచనల మేరకు నడుచుకుంటానని కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు.
మరోవైపు వైఎస్ జగన్ సర్కార్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనిక సీఎం అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఒకసారి పెట్టుబడి పెట్టి తర్వాత రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని కన్నా ఆరోపించారు. రాజధాని తరలింపు అనేది జగన్ దోపిడీ కోసమేనన్న ఆయన.. అమరావతి రాజధానిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బీహార్ కంటే అధ్వానంగా ఏపీని జగన్ మార్చేశారని కన్నా దుయ్యబట్టారు. వైసీపీ అరాచకాలు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని.. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం జగన్‌కు లేదని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
ALso REad: వేడెక్కిన రాజకీయం.. కన్నా అనుచరుడితో మంత్రి అంబటి రహస్య భేటీ, సత్తెనపల్లిలో ఏం జరుగుతోంది..?
ఇకపోతే.. గత గురువారం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన ముఖ్య అనుచరులు, శ్రేయాభిలాషులతో సంప్రదింపులు జరిపిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. అయితే తన భవిష్యత్తు కార్యచరణ ఏమిటనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన అనుచరులతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయానికి ప్రకటించనున్నట్టుగా తెలిపారు.
రాష్ట్ర పార్టీ పనితీరు నచ్చకనే రాజీనామా..
బీజేపీకి రాజీనామా చేసిన సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు గౌరవం ఉందని.. అది ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పారు. బీజేపీలో చేరినప్పటికీ నుంచి పార్టీ అభివృద్ది కోసం కృషి చేశానని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందరిని ఏకతాటిపై నడిపానని తెలిపారు. సోమువీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయిందని విమర్శించారు. సోమువీర్రాజు నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదన్నారు. సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆయన వైఖరి, వ్యవహారశైలి నచ్చకనే పార్టీని వీడుతున్నట్టుగా చెప్పారు. తన పాటు రాజీనామా చేసిన అనుచరులకు ధన్యవాదాలు తెలియజేశారు.
