గుంటూరు జిల్లాలో భాజపా నేత, సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ కీలక విషయాన్ని బయటపెట్టారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు వైసిపితో పాటు టిడిపి నుండి కూడా ఆహ్వానాలు అందినట్లు చెప్పారు. మూడున్నరేళ్ళ రాష్ట్రప్రభుత్వ పాలన గురించి మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు పాలనపై తనలోని అసంతృప్తిని వ్యక్తం చేశారు. టిడిపి-భాజపాలు మిత్రపక్షాలే అయినప్పటికీ తమకు టిడిపి కనీసమర్యాద కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు.

నియోజకవర్గాల్లో తమ పార్టీ వారికి కనీస ప్రయోజనాలు కూడా అందించలేకపోతున్నట్లు వాపోయారు. అధికారంలో ఉన్నప్పటికీ పెన్షన్లు, ఇళ్ళు కూడా ఇప్పించుకోలేకపోతున్నట్లు వాపోయారు. తర్వాత భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడుతూ, తనను వైసిపిలో చేరమని ఆహ్వానం అందినట్లు చెప్పారు. అదే సందర్భంలో టిడిపిలో చేరాల్సిందిగా కూడా అడుగుతున్నట్లు తెలిపారు.

కాకపోతే రెండు పార్టీల నుండి వచ్చిన ఆహ్వానాలను తాను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేయాలన్న విషయాన్ని భాజపా అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు వద్దని తమ కార్యకర్తలు గట్టిగా చెబుతున్నట్లు చెప్పారు. ఎందుకంటే, తమకు టిడిపి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

సరే, టిడిపితో  పొత్తుటుందా? ఉండదా అన్న విషయం రాష్ట్రంలో తేలేది కాదు. అదే విధంగా ఇంకేదైనా పార్టీతో పొత్తుంటుందా అన్నది కూడా ఇక్కడ తేలేదికాదు. అలాగే, చనిపోయే వరకూ భాజపాలోనే ఉంటానని ఇపుడు చెబుతున్న కన్నా రాబోయే రోజుల్లో వైసిపిలోకి వెళ్ళరన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. ఎందుకంటే, ఈ విధంగా గతంలో చెప్పిన రాజకీయా నేతల్లో చాలామంది మెల్లిగా ఏదో ఒక పార్టీలోకి జంప్ చేసినవారే. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కదా?