ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం తన ముఖ్య అనుచరులు, శ్రేయాభిలాషులతో సంప్రదింపులు జరిపిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం తన ముఖ్య అనుచరులు, శ్రేయాభిలాషులతో సంప్రదింపులు జరిపిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. అయితే తన భవిష్యత్తు కార్యచరణ ఏమిటనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన అనుచరులతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయానికి ప్రకటించనున్నట్టుగా తెలిపారు. 

ఈ క్రమంలో అయినా భవిష్యత్తు కార్యచరణ ఏమిటనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కన్నా లక్ష్మీనారాయణ జనసేలో గానీ, టీడీపీలో గానీ చేరవచ్చని గత కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. జనసేనలో కీలక నేత నాదెండ్ల మనోహర్.. కన్నా లక్ష్మీనారాయణతో భేటీ కావడంతో ఆయన జనసేనకు దగ్గర అవుతున్నారనే ఊహగానాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరే అవకాశం ఉంది. కొద్దిరోజుల క్రితం టీడీపీ నేతలతో కన్నా లక్ష్మీనారాయణ చర్చలు జరిపారని.. ఆ పార్టీలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కన్నా విషయానికి వస్తే.. 
సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ.. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో కోట్ల విజయభాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్నారు. అయితే ఏపీ పునర్విభజన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. 2014లో కన్నా లక్ష్మీ నారాయణ కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బాగోలేదనే ఆలోచనతో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. 2019 ఎన్నికలకు ముందే పార్టీ మారతారనే ప్రచారం సాగింది. టీడీపీ, వైసీపీలు కన్నాతో చర్చలు జరిపాయనే వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కూడా కన్నాను పార్టీలోకి చేర్చుకునేందుకు ఆసక్తికనబరిచడంతో.. ఆయన కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. 

అయితే ఆ తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ అధినాయకత్వం కన్నా లక్ష్మీనారాయణతో సంప్రదింపులు జరిపారు. 2018 మే నెలలో కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ చీఫ్‌గా నియమించారు. ఈ క్రమంలోనే 2019 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ కన్నా నేతృత్వంలోనే వెళ్లింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితమే మిగిలింది. ఇక, రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా రెండేళ్ల పదవీకాలం పూర్తికాగానే.. కన్నాను ఆ పదవి నుంచి బీజేపీ అధిష్టానం తప్పించింది. ఆ స్థానంలో సోము వీర్రాజును నియమించింది. 

ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నప్పటికీ.. రాష్ట్ర పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యాక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం, పనితీరుపై ఆయన చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార వైసీపీపై సోము వీర్రాజు మెతకగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలంటే అధికార పార్టీపై పోరాటం చేయాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావులు అధికార వైసీపీపై కాకుండా ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించడాన్ని కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశఆరు. 

రాష్ట్ర పార్టీ పనితీరు నచ్చకనే రాజీనామా.. 
బీజేపీకి రాజీనామా చేసిన సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు గౌరవం ఉందని.. అది ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పారు. బీజేపీలో చేరినప్పటికీ నుంచి పార్టీ అభివృద్ది కోసం కృషి చేశానని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందరిని ఏకతాటిపై నడిపానని తెలిపారు. సోమువీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయిందని విమర్శించారు. సోమువీర్రాజు నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదన్నారు.

సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆయన వైఖరి, వ్యవహారశైలి నచ్చకనే పార్టీని వీడుతున్నట్టుగా చెప్పారు. తన పాటు రాజీనామా చేసిన అనుచరులకు ధన్యవాదాలకు ధన్యవాదాలు తెలియజేశారు.

టీడీపీలో చేరాలని నిర్ణయం..?
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జనసేన వైపు కూడా వెళ్లాలని తొలుత ఆలోచన చేసినప్పటికీ.. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఆదరణపై సందేహాలు, ఆ పార్టీలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మినహా ఆదరణ కలిగిన వ్యక్తులు లేకపోవడంతో ఆ ప్రతిపాదనను ఆయన విరమించుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లిన కన్నా.. కొద్ది రోజుల కిందట వారితో మంతనాలు సాగించినట్టుగా తెలుస్తోంది. కన్నా ఎంట్రీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరితే అది పార్టీ ప్లస్ అవుతుందనే అభిప్రాయంతో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ నెలలోనే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ నిర్ణయాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి లేదా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.