వెంకయ్యను ఊరూరా తిప్పి సన్మానాలు చేశారు: బాబుపై కన్నా ఫైర్

First Published 28, May 2018, 5:40 PM IST
Kanna Lakshminarayana questions Chandrababu stand
Highlights

హోదా కన్నా ఎక్కువే సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వీట్లు పంచారని, వెంకయ్య నాయుడిని ఊరూరా తిప్పి సన్మానాలు చేశారని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. 

గుంటూరు: హోదా కన్నా ఎక్కువే సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వీట్లు పంచారని, వెంకయ్య నాయుడిని ఊరూరా తిప్పి సన్మానాలు చేశారని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించి అలా చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని న్నారు. 

తెలుగుదేశం పార్టీ నిర్వహించింది మహానాడు కాదని, అది మాయనాడు అని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఏం సాధించామో చెప్పుకోలేని స్థితిలో టీడీపి నాయకులున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం కాదని, ఎన్టీఆర్ పై చెప్పులు వేయించి, ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారని కన్నా ఆరోపించారు. టీటీడిలో అన్యాయాలపై మాట్లాడుతుంటే మీకు ఎందుకు ఉలుకు అని, అది చూస్తుంటే టీడీపిపై అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. టీటీడీలో అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ఆయన కోరారు. 

కర్ణాటకలో బిజెపికి ఓటు వేయవద్దని చంద్రబాబు చెప్పినా తెలుగు ప్రజలు వినలేదని, తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో 16 సీట్లు బిజెపి గెలుచుకుందని ఆయన చెప్పారు. చంద్రబాబు అసమర్థత వల్లనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు.

loader