గుంటూరు మునిసిపల్ ఎన్నికల్లో బీజేపి-జనసేన కలిసి జంటగా పోటీ చేస్తాయని ఆంధ్ర ప్రదేశ్ బిజెపి మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఇరు పార్టీలు పరస్పర అంగీకారంతో పొత్తు పెట్టుకుని 111స్థానాలలో పోటీ చేస్తామని .కన్నా వెల్లడించారు. 

తాజాగా కన్నా మాట్లాడుతూ... మా కూటమికి ఓటు వేస్తే అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో  బీజేపి-జనసేన కూటమి విజయం సాధిస్తే  నిధులు పక్కదారి పట్టకుండా చూస్తామని కన్నా హామీ ఇచ్చారు. ప్రాంతీయ పార్టీ లు గతంలో జన్మ భూమి కమిటీల పేరుతో, ఇప్పుడు వాలంటీర్ల పేరుతో మోసం చేస్తున్నారు మండిపడ్డారు. 

''మాచర్ల, పిడుగురాళ్లలలో మరోసారి నామినేష్లను వేయడానికి అవకాశం కల్పించాలని కోరడానికి ఎన్నికల కమిషన్ ను కలుస్తాం. గుంటూరులో గత 7సంత్సరాలలో నేను చేసిన అభివృద్ది తప్ప ఏమి జరగలేదు. దీనిపై ఎవరైనా నాతో ఛాలెంజ్ కి సిద్ధమా'' అని కన్నా సవాల్ విసిరారు.

ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా జరగుతున్న దాడులు జరుగుతున్న విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని అన్నారు. బిజెపి శ్రేణులు అధికార వైసిపి నాయకులు, కార్యకర్తలకు భయపడకుండా ధైర్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ముందుకుసాగాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. 

తాను మంత్రిగా వున్న సమయంలోనే గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు, నాయకులు గుంటూరు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో పాలన సాగించిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. బీజేపీ - జనసేన కూటమికి అధికారాన్ని అప్పగిస్తే కేంద్ర నిదులతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని కన్నా హామీ ఇచ్చారు. 

రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులతోనే పాలన సాగిస్తూ అదే ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ప్రజలపై ప్రభుత్వం ఇంటి పన్నును పెంచిందని... బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే పెంచిన ఇంటి పన్నులు నిలిపివేస్తామని కన్న హామీ ఇచ్చారు. ఇంటి ప్లాన్ , కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్‌లకు ఇలా ఏది కావాలన్నా తప్పకుండా ఎమ్మెల్యేలకు టాక్స్ కట్టాల్సి వస్తుందని... బీజేపీ అభ్యర్థులు గెలిచిన డివిజన్లలో ఎమ్మెల్యే ట్యాక్స్ లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రాంతీయ పార్టీలు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్‌లు లాక్కెళుతున్నాయని కన్నా వ్యాఖ్యానించారు.