దాడులు మా పైనే.. కేసులు మాపైనే.. చంద్రబాబు ప్రభుత్వంపై రాజ్‌నాథ్‌కి కన్నా ఫిర్యాదు

First Published 16, Jul 2018, 3:17 PM IST
kanna lakshminarayana comments on chandrababu naidu
Highlights

రాష్ట్రంలో శాంతిభద్రతలు, అవినీతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ

రాష్ట్రంలో శాంతిభద్రతలు, అవినీతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... జన్మభూమి కమిటీల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అన్ని స్థాయిల్లో అవినీతి జరుగుతోందని.. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోయాయని.. బీజేపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని... దాడులు చేసిన టీడీపీ నేతలను వదిలేసి.. ఇతర పార్టీల వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని కన్నా ఆరోపించారు.. బీజేపీ నేతలను టార్గెట్ చేసి.. ప్లాన్ ప్రకారం దాడులు చేస్తున్నారని..  నాపై అనంతపురం, కావలి, ఒంగోలుల్లో దాడులకు దిగారని.. కొన్ని చోట్ల అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపైనే పోలీసులు దాడికి దిగారని లక్ష్మీనారాయణ చెప్పారు..

తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని.. ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలు, అవినీతిని నిలదీస్తున్నందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పాలన చూడలేదన్నారు. రాష్ట్రప్రభుత్వ వ్యవహారశైలిపై రాజ్‌నాథ్  సింగ్‌కు ఫిర్యాదు చేసినట్లు కన్నా వెల్లడించారు.
 

loader