ఎపిలో బిజెపికి తొలి షాక్: జగన్ పార్టీలోకి కన్నా, సోముకు పార్టీ పగ్గాలు?

First Published 22, Apr 2018, 12:38 PM IST
Kanna Lakshmi Narayana may join in YCP
Highlights

జగన్ పార్టీలోకి కన్నా, సోముకు పార్టీ పగ్గాలు?

గుంటూరు: ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే చిక్కుల్లో పడిన బిజెపికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి షాక్ తగలనుంది. పార్టీ ముఖ్య నాయకుడు కన్నా లక్ష్మినారాయణ బిజెపిని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును ఖరారు చేయడంతో కన్నా ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్ష పదవికి కన్నా లక్ష్మినారాయణ పేరును చివరి వరకు పరిశీలించారు. అయితే, చివరకు సోము వీర్రాజును ఆ పదవికి ఎంపికి చేసి పార్టీ నేతలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొదటి నుంచి పార్టీతో ఉన్నవారికే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కన్నా లక్ష్మినారాయణ పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కన్నా లక్ష్మినారాయణ కాంగ్రెసు నుంచి బిజెపిలోకి వచ్చారు. దానికితోడు, సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ కు సన్నిహితుడు. 

కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని అంటున్నారు. ఈ విషయంపై చర్చించడానికి కన్నా లక్ష్మినారాయణ తన నివాసంలో తన సన్నిహితులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారు కూడా కన్నా పార్టీ మార్పునకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
loader