మణప్పురం గోల్డ్ లోన్స్ దొంగతనం కేసులో ట్విస్ట్ ... పదికిలోల బంగారం చోరీకి అక్రమ సంబంధమే కారణమట
కంకిపాడు మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో బంగారం చోరీ ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ పదికిలోల బంగారం దొంగతనానికి అక్రమ సంబంధమే కారణంగా తెలుస్తోంది.

మచిలీపట్నం : ప్రముఖ బంగారు రుణాల సంస్థ మణప్పురం గోల్డ్ లోన్ లో కస్టమర్ల బంగారంతో ఓ మహిళా ఉద్యోగిని పరారైన ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూసింది. అయితే ఇలా తన ఉద్యోగాన్నే కాదు జీవితాన్ని రిస్క్ లో పెట్టి కిలోల కొద్ది బంగారాన్ని దొంగిలించడానికి అక్రమ సంబంధమే కారణమని బయటపడింది. ప్రియుడి కోసమే ఉద్యోగం చేస్తున్న గోల్డ్ లోన్ సంస్థలోనే ఆమె దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. అయితే దొంగిలించిన ఆమె పోలీసులకు పట్టుబడగా ప్రియుడు మాత్రం బంగారంతో ఉడాయించాడు. పరారీలో వున్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... గుడివాడ రూరల్ లింగవరం అడ్డరోడ్డుకు చెందిన పావని మణప్పురం గోల్డ్ లోన్స్ సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు పెళ్లయినా భర్తలో విబేధాల కారణంగా విడిపోయింది. దీంతో ఒంటరిగా వుంటున్న ఆమెకు ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహకుడితో పరిచయం ఏర్పడింది. వీరిమధ్య స్నేహం కాస్త మరింత ముదిరి అక్రమ సంబంధానికి దారితీసింది.
పావని ప్రియుడి కష్టసుఖాలను కూడా పంచుకుంటూ చాలా దగ్గరయ్యింది. ఈ క్రమంలోనే అతడు భారీగా అప్పుల్లో కూరుకుపోయినట్లు ఆమె తెలుసుకుంది. ప్రియుడిని ఈ అప్పుల భారినుండి బయటపడేసేందుకే ఆమె అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేసింది.
Read More మణప్పురం గోల్డ్ లోన్ లో ఇంటిదొంగ నిర్వాకం... 10 కిలోల బంగారంతో ఉద్యోగిని జంప్ (వీడియో)
ఇటీవలే బదిలీపై కంకిపాడు వెళ్లిన పావని బ్రాంచ్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించింది. అక్కడ కస్టమర్లు తాకట్టుపెట్టిన 16 కిలోల బంగారంపై ఆమె కన్నుపడింది. ఈ బంగారాన్ని దొంగిలించి ప్రియుడికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అదునుకోసం ఎదురుచూసిన ఆమె ఈ నెల 16న రాత్రి అనుకున్నట్లుగానే బంగారాన్ని దొంగిలించింది. 16 కిలోల బంగారంలో 10 కిలోలు దోచుకుని పరారయ్యింది.
దొంగిలించిన బంగారాన్ని తీసుకుని నేరుగా ఇంటికి వెళ్లిన పావని ప్రియుడికి సమాచారం అందించింది. అతడికి బంగారం అప్పగించి కొంత తనవద్దే పెట్టుకుంది. అనంతరం బంధువులతో కలిసి మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయానికి వెళ్ళింది.
మేనేజర్ పావని విధులకు హాజరుకాకపోవడంతో అనుమానం వచ్చిన కంకిపాడు మణప్పురం బ్రాంచి ఉద్యోగులు ఉన్నతోద్యోగులకు సమాచారం అందించారు. వారు కంకిపాడుకు చేరుకుని బంగారాన్ని పరిశీలించగా 10కిలోలు కనిపించకపోవడంతో కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు వారు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పావని కోసం గాలింపు చేపట్టారు. వెంటవెళ్ళిన బంధువుల ఫోన్ తో కుటుంబసభ్యులకు ఆమె టచ్ లో వున్నట్లు గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులను విచారించగా షిరిడీలో వున్నట్లు చెప్పారు. వెంటనే షిరిడీకి వెళ్లిన పోలీస్ బృందం పావనిని అదుపులోకి తీసుకుంది. ఆమెవద్ద వున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మిగతా బంగారం గురించి పావనిని విచారించగా అసలు నిజం బయటపెట్టింది. ప్రియుడి కోసమే ఈ బంగారాన్ని దొంగిలించినట్లు... మిగతా బంగారం అతడివద్దే వున్నట్లు బయటపెట్టింది. దీంతో పావని నుండి ప్రియుడి వివరాలు సేకరించిన పోలీసులు గాలింపు చేపట్టారు.