బుధవారం ఉదయం పరమపదించిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి ఏపితో విడదీయరాని అనుబంధముంది. ప్రత్యేకించి తిరుమలతో ఉన్న బంధం  చెప్పనే అవసరం లేదు. ఒక్క తిరుపతి, తిరుమలే కాకుండా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో తరచూ జరిగే ప్రముఖ ఉత్సవాలు, కృష్ణా, గోదావరి పుష్కరాల్లో క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. దాంతో సహజంగానే రాజకీయంగా కూడా ఎంత వద్దన్నా వాసనలు అంటుకుంటాయి కదా?

కృష్ణ, గోదావరి నదులకు సంబంధించి ప్రారంభంలో జరిగే పుష్కర హారతిని జయేంద్ర సరస్వతి ఇవ్వనిదే పుష్కరాలు ప్రారంభమయ్యేవి కావు. ప్రముఖ పీఠాధిపతి జయేంద్ర సరస్వతే స్వయంగా హారతి ఇస్తున్నారంటే కార్యక్రమానికి హాజరుకాని ముఖ్యమంత్రులు, మంత్రులెవరుంటారు చెప్పండి?

పుష్కరాలతో పాటు తిరుమల, కర్నూలులోని అహోబిలం మఠం, విశాఖపట్నంలోని శారధా పీఠం, విజయవాడలోని కంచిపీఠం తదితర పీఠాలకు, మఠాల్లో జరిగే కార్యక్రమాలకు జయేంద్ర సరస్వతి హాజరయ్యేవారు.

దాంతో అదే కార్యక్రమాలకు హాజరైన రాజకీయ ప్రముఖులు కూడా జయేంద్ర ఆశీస్సుల కోసం ఎగబడేవారు.  అవసరార్దం కంచిమఠంకూడా వెళ్ళేవారు. దాంతో సహజంగానే వారితో ఎంతో కొంత సాన్నిహిత్యం ఏర్పడిన కారణంగా జయేంద్ర సరస్వతికి కూడా రాజకీయ వాసనలు అంటుకున్నాయ్.