బెజవాడ వాసులు దశాబ్ధాలుగా ఎదురుచూస్తోన్న కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈ నెల 18వ తేదీన ప్రారంభిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని తెలిపారు.

ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. నిజానికి సెప్టెంబర్ 4వ తేదీన ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం జరగాల్సి వుంది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించడంతో కేంద్రం వారం రోజులు సంతాప దినాలు ప్రకటించింది.

ఈ రోజుల్లో ఎలాంటి కొత్త పనులు, ప్రారంభోత్సవాలు చేయకూడదు. దీంతో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కేశినేని నాని కొత్త తేదీలను ప్రకటించారు.

కరోనా వైరస్ నేపథ్యంలో నితిన్ గడ్కరీ ప్రత్యక్షంగా కాకుండా.. ఆన్‌లైన్ ద్వారా దీనిని ప్రారంభించే అవకాశం వుంది. కాగా 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలోనే కేంద్ర ప్రభుత్వ నిధులతో కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభమైంది.

ఆ తర్వాత ఎన్డీఏ నుంచి టీడీపీ తప్పుకోవడంతో నిధులు ఆలస్యంగా విడుదలయ్యాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు తిరిగి ప్రారంభమై, ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యింది.