కార్పొరేషన్ ఎన్నికల వేళ బెజవాడ లో జనసేన‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సభ్యత్వానికి, 50 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్ధిత్వానికి జనసేన స్పీకర్ ప్యానల్‌ సభ్యుడు కామరాజ్ హరీష్ కుమార్ రాజీనామా చేశారు.

అనంతరం జనసేన నేత పోతిన మహేష్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్. జనసేన పార్టీని నమ్ముకుని ఉన్న తనకు మహేష్ అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. పార్టీ కోసం తాను ఎంతగానో కృషి చేశానని.. పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి జనసేన లో కొనసాగుతున్నానని హరీశ్ స్పష్టం చేశారు.

50వ డివిజన్ లో పోటీ చేయమని పోతిన మహేష్ ప్రోత్సహించారని.. అయితే 50వ డివిజన్‌లో తన సొంత కుటుంబానికి చెందిన వారు టీడీపీకి ఓటు వేయమని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనను ఇలా తక్కువ చూపు చూడటం తాను తట్టుకోలేక పార్టీ సభ్యత్వనికి రాజీనామా చేస్తున్నానని హరీశ్ వెల్లడించారు. తాను వేసిన నామినేషన్‌ను 2వ తేదీన ఉపసంహరించుకుంటానని తేల్చిచెప్పారు. పోతిన మహేష్ కారణంగానే తాను జనసేనను వీడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.