Asianet News TeluguAsianet News Telugu

అదికూడా చెయ్యలేని నిస్సహాయస్థితిలో హోంమంత్రి...సర్వం ఆ ముగ్గురే: కాల్వ శ్రీనివాసులు

రాయలసీమకు చెందిన అంశాలను ప్రజలకు తెలియచేస్తున్నానని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. 

kalva srinivasulu comments on rayalaseema projects
Author
Guntur, First Published Aug 11, 2020, 10:08 PM IST

గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర పాలన, ముఖ్యమంత్రి నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్ కు ఏ విధంగా అడ్డుగోడలుగా నిలుస్తున్నాయో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రజలకు వివరించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు గుర్తుచేశారు. దానికి కొనసాగింపుగా రాయలసీమకు చెందిన అంశాలను ప్రజలకు తెలియచేస్తున్నానని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. 

మంగళవారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. చురుగ్గా ఉండే టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ, మరోవైపు చంద్రబాబు నాయుడికి లేనిపోని అంశాలు ఆపాదిస్తూ దూషిస్తున్నారని కాల్వ మండిపడ్డారు. చంద్రబాబు ఏనాడూ తన కులానికి, తన కుటుంబానికి రాజకీయ నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించలేదని మాజీ మంత్రి స్పష్టం చేశారు. 

బీసీలు, దళితులు ఎవరైనా సరే జగన్ ప్రభుత్వంలో నిర్ణయాధికారం చేసే స్థాయిలో ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. కానిస్టేబుల్ బదిలీ కూడా చేయలేని నిస్సహాయస్థితిలో హోం మంత్రి ఉన్నారని, ఇతర బీసీ, దళిత మంత్రులు ఎవరికైనా వారి వారి శాఖలపై అజమాయిషీ లేకుండా పోయిందన్నారు. రాజకీయ కార్యకలాపాల్లో తనకు చేదోడువాదోడుగా ఉండటానికి, తన ప్రతినిధులుగా మూడు ప్రాంతాలకు ముగ్గురుని నియమించారన్నారు. ప్రభుత్వంలో, పార్టీలో వారిదే పెత్తనమని...రాయలసీమను సజ్జల రామకృష్ణారెడ్డికి, ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డికి, కోస్తాను తన బాబాయి వై.వీ.సుబ్బారెడ్డికి అప్పగించిన ముఖ్యమంత్రికి  దళితులు, బీసీల్లో ఆ స్థాయి నాయకుడు దొరకలేదా? అని కాల్వ నిలదీశారు. 

అధికారికంగా చేసే ప్రకటనల్లో ఆ ముగ్గురి పెత్తనం పార్టీలో, ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఒకే సామాజికవర్గం చేతిలో పార్టీ, ప్రభుత్వం ఉన్నప్పుడు  దళితులు, బీసీలకు ప్రాముఖ్యత ఎక్కడుందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ముగ్గురు వ్యక్తులే సర్వం తామై వ్యవహరిస్తున్నప్పుడు, బీసీలు, దళితులు వైసీపీ ప్రభుత్వంలో, పార్టీలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నారో చెప్పాల్సిన పనిలేదన్నారు.

read more   కనకదుర్గమ్మ తల్లే రాష్ట్రాన్ని, రాజధానిని కాపాడుతుంది: దేవినేని ఉమ

రాయలసీమ జిల్లాల గతిని మార్చే అనేక పథకాలు చంద్రబాబు హాయాంలో అమలయ్యాయని కాల్వ తెలిపారు. 2014-2019మధ్య కాలం రాయలసీమకు స్వర్ణయుగమని,  ఆ సమయంలో రూ.10వేలకోట్ల ఖర్చుగల సాగునీటి ప్రాజెక్టులను అనంతపురం జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు. హంద్రినీవా కాలువ వెడల్పుకు రూ.3వేలకోట్లు, గాలేరు-నగరికి రూ.2,500కోట్లు ఖర్చుచేయడం జరిగిందని కాల్వ చెప్పారు. 

దివంగత ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే ఆ రెండు పథకాలను చంద్రబాబు పూర్తిచేయడం జరిగిందన్నారు. ఆ రెండు ప్రాజెక్టులకు వైసీపీ ప్రభుత్వం ఈ 15నెలల్లో ఎంత ఖర్చుచేసిందో సమాధానం చెప్పగల దమ్ము, ధైర్యం వైసీపీ నేతలకు ఉందా? అని కాల్వ సవాల్ చేశారు. భైరవాని తిప్ప, పేరూరు, ఉరవకొండ నియోజకవర్గంలో సామూహిక బిందుసేద్యం ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్ వంటివన్నీ చంద్రబాబు నాయుడి కృషి ఫలితంగానే రాయలసీమకు వచ్చాయన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ కు నీళ్లు రాబట్టే అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ వచ్చిందన్నారు. బర్జర్ పెయింట్స్, హిందూపురం, మడకశిరలో ఏర్పాటైన గార్మెంట్స్ పరిశ్రమలు ఏర్పాటు కావడానికి చొరవ తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. 

70ఏళ్ల కాలంలో ఎన్నడూరాని పరిశ్రమలు అనంతపురం జిల్లాకు వచ్చాయని... ఎప్పుడూ రాని నీళ్లు అక్కడ పారాయని  కాల్వ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రైతులకు ఎన్నడూ లేనివిధంగా సూక్ష్మసేద్యం పరికరాలను అందించడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తనోత్పత్తి కేంద్రం, భారీ సోలార్ ప్లాంట్, సిమెంట్ పరిశ్రమలు వచ్చింది చంద్రబాబు పాలనలోనే అని...అవునో కాదో వైసీపీనేతలు సమాధానం చెప్పాలన్నారు. పక్కనే కృష్ణా నది ఉన్నా కర్నూలు జిల్లాకు నీటికొరత ఉండేదని, దాన్ని గమనించి ముచ్చుమర్రి (రూ.590కోట్ల వ్యయం) ద్వారా కృష్ణానీటిని మల్యాలకు తరలించడం జరిగిందన్నారు. పులకుర్తి, పులికనుమ, సిద్దాపురం ఎత్తిపోతల పథకం పూర్తిచేసింది, ఆర్డీఎస్ కుడికాలువను రూ.250ఖర్చుతో పూర్తిచేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. 

వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి చంద్రబాబు తపన పడ్డారని, శతాబ్దాల కరువుని పారదోలడానికి కంకణ బద్ధుడై పనిచేశారన్నారు. రాయలసీమకు చెందిన జగన్మోహన్ రెడ్డి, ఆప్రాంతం సాగునీటి ప్రాజెక్టులను వివాదాల కేంద్రాలుగా మార్చాడన్నారు. పక్కరాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రాయలసీమను శత్రు ప్రాంతంగా చూసే వాతావరణం జగన్ సృష్టించాడన్నారు. ముచ్చుమర్రి ప్రాజెక్టులో అదనంగా పంపులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా, దాన్ని కాదని కొత్త ప్రాజెక్ట్ పేరుపెట్టి సాగునీటి ఆయకట్టు పెరగకపోయినా రాయలసీమ ప్రయోజనాలను వివాదం చేయడం జగన్ కే దక్కిందన్నారు. 

ముచ్చుమర్రి కింద 12 పంపుల నిర్మాణం పూర్తిచేస్తే కర్నూలు జిల్లా మొత్తానికి సాగునీరు అందేదన్నారు. కర్నూలు – అనంతపురం జిల్లాలకు నీటికొరత తీరేలా ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వ పెద్దలెవరైనా చెప్పగలరా అని కాల్వ ప్రశ్నించారు. వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాలువను పూర్తి చేస్తే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి సాగునీటి కొరత తీరుతుందన్నారు. 

కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ లో రాయలసీమ ప్రాజెక్టులకు చేటు తెచ్చేలా వివాదాలు, చర్చలు రావడానికి జగన్మోహన్ రెడ్డే కారకుడని కాల్వ దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లాకు కూడా చంద్రబాబు కృష్ణా జలాలు తీసుకెళ్లారని, శ్రీసిటీలో అనేక పరిశ్రమలు ఏర్పడ్డాయని, రేణిగుంట పరిసర ప్రాంతాలన్నీ సెల్ ఫోన్ల తయారీ కేంద్రాలుగా మారిపోయాయన్నారు. ఇసుజు, హీరో మోటార్స్ సంస్థలు చిత్తూరు జిల్లాలో ఏర్పడ్డాయన్నారు. ప్రచార యావతో, స్వార్థంతో రాయలసీమకు ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి తీరుపై రాయలసీమ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆలోచన చేసి, తమ ప్రాంతానికి న్యాయం జరిగేలా చూడాలని కాల్వ హితవుపలికారు.

Follow Us:
Download App:
  • android
  • ios