Asianet News TeluguAsianet News Telugu

కనకదుర్గమ్మ తల్లే రాష్ట్రాన్ని, రాజధానిని కాపాడుతుంది: దేవినేని ఉమ

 14నెలల పాలనలో వైసిపి ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

Devineni Uma Fires On YCP Govt Over Amaravati Farmers
Author
Amaravathi, First Published Aug 11, 2020, 8:20 PM IST

విజయవాడ: 14నెలల పాలనలో వైసిపి ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కరోనా కట్టడి, రోగులకు చికిత్స అందించడంలో ఘోరంగా  వ్యవహరిస్తోందని అన్నారు. ఇక అనేక అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ చేశారని... ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం ఆయన వైఫల్యాలకు, ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. 

235 రోజులుగా జరగుతున్న అమరావతి ఉద్యమంలో 29వేల రైతు కుటుంబాలు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నాయన్నారు. రాజధాని పోరాటంలో 70 మంది చనిపోయినా ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదన్నారు.  రైతులు ఇచ్చిన భూముల్లో నిర్మించిన భవనాల్లో కూర్చొని, అదే రైతులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి శాసనాలు చేస్తున్నాడని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో సాగుతున్న అటవిక, రాక్షసపాలన నుంచి న్యాయస్థానాలే  ప్రజలను కాపాడుతున్నాయని...ప్రభుత్వం ఇచ్చే జీవోలు న్యాయసమీక్షకు నిలవకపోయినా పాలకుల వైఖరి మారడం లేదన్నారు. మూడు రాజధానుల నిర్ణయంపై హైకోర్టు స్టేటస్ కో ఇస్తే ప్రభుత్వం దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. నిమ్మగడ్డ విషయంలో ఎదురైన భంగపాటే రాజధాని అంశంలోనూ ప్రభుత్వానికి తప్పదన్నారు.  

ఆగస్ట్ 16 వరకు గడువు కావాలని ప్రభుత్వం కోరుతోందని, తెలివితక్కువ తనంగా ఎంత సమయం తీసుకున్నా ముఖ్యమంత్రి రాజధానిని అంగుళం కూడా కదిలించలేడని దేవినేని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి ఎన్ని తేదీలు మార్చుకున్నా, ఎన్ని కుట్రలు పన్నినా, కుటిల నిర్ణయాలు అమలు చేయాలని చూసినా, అవేవీ జరగవన్నారు. కనకదుర్గమ్మ తల్లే రాష్ట్రాన్ని, రాజధానిని కాపాడుతుందని... అంతిమంగా న్యాయం, ధర్మమే గెలుస్తాయని దేవినేని స్పష్టంచేశారు. 

READ MORE   ఏపీ కొత్త పారిశ్రామిక విధానం: దీని కోసమా 14 నెలలు వెయిట్ చేసిందంటూ యనమల విమర్శలు

ఓట్లు దండుకోవడానికి తాడేపల్లిలో రాజప్రాసాదం కట్టిన ముఖ్యమంత్రి నోటినుంచి ఈ 14నెలల్లో ఏనాడూ అమరావతి అనే మాటే రాలేదన్నారు.  రాజధాని ఎక్కడికీ పోదని, ఇక్కడే ఉంటుందని వైసీపీనేతలు ఉత్తరకుమార ప్రగల్భాలు పలికితే, ముఖ్యమంత్రయ్యాక జగన్ మూడు రాజధానుల డ్రామాకు తెరలేపాడన్నారు. చంద్రబాబు నాయుడు రూ.64వేలకోట్లు ఖర్చుచేసి సాగునీటి విజయాలు సాధించారని, పోలవరాన్ని 70శాతం వరకు పూర్తిచేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు పునాదులే లేవలేదని చెప్పిన జగన్ ఇప్పుడు గేట్లు ఎక్కడ పెడుతున్నాడో సమాధానం చెప్పాలని దేవినేని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార నాగావళి కట్టల పనులు ఎందుకు ఆపేశారని,  పురుషోత్తమ పట్నం నుంచి ఎందుకు నీళ్లు వదలడం లేదని దేవినేని ప్రశ్నించారు. 

పట్టిసీమ ద్వారా రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడపకు నీళ్లు అందించిన ఘనత చంద్రబాబుదేనని, కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లు ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాడన్నారు.  మచ్చుమర్రి పథకం రాయలసీమ పట్టిసీమ అని, దానికి పంపులు పెట్టుకునే అవకాశం ఉంటే ఆ పనులు ఎందుకు చేయడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన హంద్రీనీవా, వేదవతి, గుండ్రేవుల, భైరవానితిప్ప, ఆర్డీఎస్, పేరూరు ప్రాజెక్టు పనులను ఎందుకు నిలిపేశారో చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. 

గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా అనంతపురానికి నీళ్లు ఇవ్వబట్టే అక్కడ కియా కార్ల పరిశ్రమ ఏర్పడిందన్నారు. కృష్ణాజిల్లాలో బందరు పోర్టు పనులు  ఆపేశారని, హెచ్ సీఎల్ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ మేమే నిర్మించామని చెప్పుకుంటున్న వారు రేపు పోలవరం, పట్టిసీమ కూడా తామే పూర్తిచేసినట్లు చెప్పుకుంటారని దేవినేని ఎద్దేవాచేశారు. 

పాలన చేతగాని, ఏం చేయాలో తెలియని, అసమర్థ ప్రభుత్వం, చివరకు తన వైఫల్యాలను కప్పిపుచ్చు కునేందుకు ప్రయత్నిస్తోందన్నారు.  విశాఖపట్నంలో కొట్టేసిన 32వేల ఎకరాలను అమ్ముకోవడానికే పాలకులు విశాఖపట్నం వెళుతున్నారు తప్ప ప్రజలను ఉధ్దరించడానికి కాదని ఉమా తేల్చిచెప్పారు. 

రాష్ట్రంలో కోవిడ్ వైరస్ ఖర్చు ఇప్పటికి రూ.4,800కోట్లు అయిందని, ఇంకా నిధులు కావాలని అడుగుతున్న ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను ఎక్కడ, ఎంతెంత ఖర్చుచేసిందో చెప్పాలన్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగంతో సరిగా పని చేయించినట్లైతే పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి మరణించాల్సిన పనివచ్చేది కాదన్నారు.  పదో తారీఖు దాటినా మెడికల్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు ఇప్పటికీ జీతాలు రాలేదని ఉమా తెలిపారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు వెళ్లిన కంపెనీల వారిని కులాల గురించి అడగటం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. 

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, దేశవిదేశాల్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేసే ఎందరో డాక్టర్లు ఉన్నతస్థానాల్లో ఉంటే వారి సేవలను ఉపయోగించకోలేని దౌర్భాగ్యపుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రధానితో చాలా నిస్సహాయంగా మాట్లాడిన జగన్ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. జూనియర్ డాక్టర్లు రోడ్లపైకి వచ్చే పరిస్థితికి ఎవరు కారణమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. కరోనా రోగుల వెతలు, వారి ఆర్తనాదాలు పట్టించుకోని 50ఏళ్లు లేని ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్కకరోనా ఆసుపత్రిని కూడా సందర్శించలేదన్నారు. 

ఒక్క ఛాన్స్ పుణ్యమా అని, ఈవీఎంల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటికీ వాస్తవాలు ఒప్పుకోవడం లేదని దేవినేని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న కరోనా లెక్కలకు, కేంద్రానికి ఇచ్చే నివేదికలకు సంబంధమే ఉండటం లేదని...ముఖ్యమంత్రి నేలవిడిచి సాము చేస్తున్నారని, ఆయన నిర్లక్ష్యధోరణి ప్రజల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా ఆరోగ్య శ్రీ కింద ఎన్ని కరోనా కుటుంబాలకు మేలు జరిగిందో, ఎందరు కరోనా రోగులకు చికిత్స లభించిందో చెప్పాలన్నారు.  ఖర్చుచేసినట్లు చెబుతున్న రూ.4,800 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలన్నారు. 

 చంద్రబాబు నాయుడు పెట్టిన మెడ్ టెక్ జోన్ ను వాడుకోవడానికి ఈ ప్రభుత్వానికి నామోషీగా ఉందన్నారు.  ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎంలు, రాజ్యసభసభ్యులు కరోనా చికిత్సకోసం పక్కరాష్ట్రాలకు వెళుతుంటే, సరైన చికిత్స లభించక సామాన్యుడు మాత్రం ఇక్కడే బలైపోతున్నాడన్నారు. చివరకు కరోనాతో మరణించిన వారి పార్థివదేహలు కూడా వారి కుటుంబాలకు చేరడం లేదన్నారు. ప్రభుత్వ అసమర్థత, చేతగాని తనం, నిర్లక్ష్యం వల్లే ప్రజల ఆరోగ్యం గాలిలో దీపమైందన్నారు.  

వాస్తవాలు ముఖ్యమంత్రికి తెలియాలంటే ఆయన రాష్ట్రంలోని ఒక్క ప్రభుత్వ ఆసుత్రినైనా సందర్శించాలని, క్వారంటైన్ రోగులకు అందుతున్న భోజనం ఖరీదు రూ.500 అని చెబుతున్న మంత్రులు దాన్ని రుచిచూడాలని దేవినేని సూచించారు. ధాన్యం రైతులకు ఇప్పటికీ రూ.236కోట్లు అందలేదని, దానివల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు బస్ లో ఉండి పాలన చేయబట్టే రాజధాని నిర్మాణానికి రైతులు భూములిచ్చారనే నిజాన్ని హైదరాబాద్ లో ఉండే చంద్రబాబు అమరావతి కట్టొచ్చు కదా అని మాట్లాడేవారు గ్రహిస్తే మంచిదని దేవినేని హితవు పలికారు. 

ముఖ్యమంత్రి చెట్టుకింద ఉండి పాలన చేస్తుంటే, మన రాజధానికి మనం భూములివ్వకపోతే ఎలా అని రైతులు ఆనాడు ఆలోచించబట్టే, జగన్ ఈనాడు రాజధానిలో కట్టిన భవనాల్లో ఉండి పాలన చేస్తున్నాడన్నారు. రైతులు ఇచ్చిన భూముల్లో కట్టిన భవనాల్లో ఉంటూ వారి గుండెలపై తన్నేలా జగన్ జీవోలు ఇస్తూ, శాసనాలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ప్రభుత్వం, అమరావతి, పోలవరం నిర్మాణాలను రెండుకళ్లుగా భావించి, లోటు బడ్జెట్లో ఉన్నరాష్ట్రాన్ని అన్ని రంగాలలో పురోగమింపచేస్తే, జగన్ 14నెలలకే చేతులెత్తేసే  పరిస్థితికి వచ్చాడని దేవినేని స్పష్టంచేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios