గుంటూరు: ఐదుకోట్ల ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ప్రజా రాజధాని అమరావతి పట్ల మరణశాసన ముద్రను వేసినట్లయ్యిందని టిడిపి నాయకులు కాల్వ శ్రీనివాసులు అన్నారు. జగన్ రెడ్డి చారిత్రక తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ప్రజలు భావిస్తున్నారని పేర్కోన్నారు. 

''అమరావతి కోసం అన్ని వర్గాల ప్రజలు దాదాపు 230 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో కోర్టులు  చీవాట్లు పెడితే గాని బుద్ది రాలేదు.  రాజధానుల అంశంలోను అదే తరహాలోనే ప్రభుత్వానికి చివాట్లు పెట్టడం ఖాయం'' అని హెచ్చరించారు. 

''అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అధికార వికేంద్రీకరణకు పాల్పడుతున్నారు. జగన్ రెడ్డికి రాజధానుల మీద అంత ప్రేమ, అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే 13 జిల్లాలను 13 రాజధానులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలి అంతే గాని రాజధానిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు, కబ్జాలు చేయడం హేయం'' అని మండిపడ్డారు. 

''14 నెలలుగా రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిపోయింది. జగన్ రెడ్డికి నిజంగా అభివృద్ధి కావాలనుకుంటే రాజధానిని మార్చాల్సిన అవసరం లేదు. ఈ చర్యలు దగాకోరు రాజకీయాలకు నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ పాలనతో ఎనలేని వ్యతిరేకతను మూటగట్టుకున్నారు'' అని కాల్వ విమర్శించారు.