రాజధాని అమరావతి ప్రాంతంలోనే  త్వరలో ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. 2006లో దలైలామా కాలచక్ర బోధించిన స్ధలంలోనే ఇపుడు కూడా కాలచక్ర నిర్వహించాలని సిఎం నిర్ణయించారు.

మామను మించిన అల్లుడనిపించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అహర్నిసలు శ్రమిస్తున్నారు. అందుకు తాజాగా మరో ఉదాహరణ. రాజధాని అమరావతిలో త్వరలో ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. పర్యాటకరంగ ప్రగతిపై సిఎం శుక్రవారం సమీక్షించారు. ఆ సమయంలో త్వరలోనే రాష్ట్రంలో ‘కాలచక్ర’ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సిఎం వెల్లడించారు. ఇందుకు బౌద్ధుల గురువైన దలైలామాను ఆహ్వానించాలని కూడా సిఎం తెలిపారు. 2006లో దలైలామా కాలచక్ర బోధించిన స్ధలంలోనే ఇపుడు కూడా కాలచక్ర నిర్వహించాలని చంద్రబాబునాయడు నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు సిఎం సమీక్ష నిర్వహించారు.

 నవ్యాంధ్రప్రదేశ్ అమరావతికి సమీపంలోనే ఉన్న సీతానగరం కొండమీద ప్రపంచాన్ని ఆకర్షించేలా ఎత్తైన బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చంద్రబాబు ప్రయత్నాలు గనుక సాకారమైతే అపుడు మామను మించిన అల్లునిగా ప్రఖ్యాతి పొందటం ఖాయం.

ఎలాగంటారా? ప్రస్తుతం హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో ఉన్న ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఎన్ టి రామారావే. ఎన్ టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే సదరు విగ్రహం ఏర్పాటైంది. హైదరాబాద్ కు వచ్చే వారికి ఆ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కాబట్టి ఆ విగ్రహానికన్నా ఎత్తైన విగ్రహాన్ని గనుక చంద్రబాబు ఏర్పాటు చేయగలిగితే అదే రికార్డుగా నిలుస్తుంది. అపుడు ఎత్తైన బుద్ధుని విగ్రహం ఎక్కడుంది? ఎవరు పెట్టించారంటే వెంటనే చంద్రబాబే గుర్తుకు వస్తారు. దాంతో చంద్రబాబు మామని మించిన అల్లుడనిపించుకోవటం ఖాయం.

ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, విధివిధానాలను రూపొందించాలని, బౌద్ధగురువుల సలహాలను కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది ప్రధామార్ధంలో మన రాష్ట్రంలో అంతర్జాతీయ స్ధాయిలో కూచిపూడి, ఉత్సవం, సంగీత ఉత్సవంతో పాటు పర్యాటక రంగమే ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ప్రభుత్వం భావిస్తోంది.

 అంతేకాకుండా అంతర్జాతీయ టూరిజం, హెలీటూరిజం, పర్యావరణ టూరిజం, ఎకోటూరిజంల ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేయాలని కూడా చంద్రబాబు చెప్పారు. విలాస, వినోద పన్నుపై 3 ఏళ్ళపాటు 100 శాతం మినహాయింపు వ్యవధిని ఐదేళ్ళకు పెంచాలని పర్యాటక శాఖను ప్రతిపాదనలు సిద్దం చేయమని ఆదేశించారు. గుజరాత్ లో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని అధికారులు వివరించారు. అటువంటి చట్టాలను మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాల్సిందిగా సిఎం సూచించారు.