గుంటూరు: న్యాయ వ్యవస్థపై, న్యాయ మూర్తులపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకే మాయని మచ్చ అని ఏపీ టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య గల సమతుల్యాన్ని దెబ్బతీసేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

''భారత న్యాయ వ్యవస్థ ఏకీకృత సమగ్ర స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థ. ఇందులో ఎవరి జోక్యం ఉండదు. ఉండకూడదు. అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. వైసీపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను మసకబారేలా చేయడం దుర్మార్గం. వ్యవస్థల తప్పిదాల నుండి ప్రజలను కాపాడే న్యాయ వ్యవస్థను బలహీనపరిచే చర్యలకు పాల్పడడం అత్యంత దుర్మార్గం'' అన్నారు. 

''స్వతంత్ర భారతదేశంలో న్యాయవ్యవస్థ ఎన్నడూ ఎదుర్కొనని అసాధారణ పరిణామాలు ఇప్పుడే ఎందుకొచ్చాయి. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగేలా  పరిణామాలకు రాష్ట్రం ఎందుకు వేధికైంది.? నిన్న జస్టిస్ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలి. ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరించాలి. న్యాయ వ్యవస్థ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే'' అని  సూచించారు.

''జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వ అజెండాను, ఒక రాజకీయ పార్టీ అజెండాను మోస్తూ జస్టిస్ ఈశ్వరయ్య రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేసేలా వ్యవహరించారు. జస్టిస్ ఈశ్వరయ్య వెనుక ఎవరున్నారు? అతనితో ఎవరు మాట్లాడిస్తున్నారు? అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు జరగాలి. న్యాయ వ్యవస్థను కాపాడాలి'' అని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.

read more   రాజధానిని మూడుముక్కలు చేసే అధికారాన్నిచ్చింది వారే...: అమర్నాథ్ రెడ్డి

''రాజ్యాంగంలోని చట్టాలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులను తుంగలో తొక్కుతోంది. ఇప్పుడు ప్రభుత్వ విభాగానికి ఛైర్మన్ గా ఉంటూ న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని తులనాడడం అత్యంత బాధాకరం. న్యాయవ్యవస్థ గౌరవానికి ప్రమాదకరంగా మారిన శక్తులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు, చీఫ్ విప్, స్పీకర్ గతంలో న్యాయవ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా జడ్జిగా పని చేసిన వ్యక్తి న్యాయ వ్యవస్థను తులనాడారు. ఈ పరిణామాలు దేశానికి ఏం సందేశమిస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి'' అని అడిగారు. 

''న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడికి, న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ చేస్తున్న వ్యాఖ్యలకు రాష్ట్రం వేధిక కావడం అత్యంత బాధాకరం. సంకుచిత విధానాలు, స్వార్ధపూరిత రాజకీయాల నుండి న్యాయ వ్యవస్థ పరిరక్షించే విధంగా చట్టాలు రూపొందాలి. ప్రజలంతా ఏకం కావాలి'' అని పిలుపునిచ్చారు. 

''మూడు రాజధానుల నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కర్నూలులో రాజధాని ఏర్పాటు పేరుతో కార్యాలయాల తరలింపును గతంలోనే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇప్పుడు విశాఖ పేరుతో మళ్లీ హడావుడి చేయడం కోర్టు తీర్పును ధిక్కరించడమే. కోర్టు తీర్పులను ప్రభుత్వమే అనుసరించకుంటే న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడులు, వ్యక్తిగత వ్యాఖ్యానాల నుండి ఏ విధంగా కోర్టు గౌరవాన్ని ప్రభుత్వం కాపాడుతుంది.?'' అని నిలదీశారు. 

''దేశంలో ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాజధాని ఇది అని నిర్ణయించిన తర్వాత మార్చడం ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా.? ప్రజల అభీష్టానికి విరుద్ధంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి.. ప్రజల అభిప్రాయం తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? విజ్ఞత, రాజనీతిజ్ఞత, భాధ్యత లేని ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలోని వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం విచ్చిన్నకర విధానాలు, రాజ్యాంగేతర విధానాలతో రాష్ట్రాన్ని వినాశనం వైపు నడిపించడం సమర్ధనీయం కాదని ప్రభుత్వం గ్రహించాలి'' అని కళా వెంకట్రావు పేర్కొన్నారు.