Asianet News TeluguAsianet News Telugu

సిగ్గుచేటు... వరదల్లో రైతులు, ఇళ్లలో వైసీపీ నేతలు: కళా వెంకట్రావు ఆగ్రహం

వరదలతో ఆరుగాలం శ్రమించి పండిచిన పంట నష్టపోయి రైతులు కన్నీళ్లలో ఉంటే వైసీపీ నేతలు మాత్రం ఇళ్లలో ఉండటం సిగ్గుచేటని మాజీ మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. 

kala venkat rao serious on YSRCP leaders
Author
Amaravathi, First Published Oct 15, 2020, 7:55 PM IST

గుంటూరు: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంతో అధికారంలోకి రావడంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని... ఇప్పుడు వరదలు రావడంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు మండిపడ్డారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట మునిగిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

''ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 3.30 లక్షల ఎకరాల్లో  పంట నష్టం వాటిల్లింది. ఆ నష్టం నుంచి రైతులు కోలుకోకముందే ఇప్పుడు రాష్ట్రంలో గత 4 రోజుల నుంచి కురిసిన వర్షాలకు మరో 2.2 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. ఇందులో వ్యవసాయ పంటలు 1.79 లక్షల ఎకరాలు, ఉద్యానపంటలు 23 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నది.  గుంటూరు జిల్లాలో 3.85 లక్ష ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు రైతులు నష్టపోయారు'' అని తెలిపారు. 

''భారీ వర్షాలకు తీత దశలో ఉన్న పత్తి తడిసి నల్లగా బూజు పట్టింది. అందువల్ల పత్తి రైతులు నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాలో 10,200 హెక్టార్లలో పత్తి, మరో 10 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఉభయ గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట మునిగిపోయింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో కూడా అరటి, కొబ్బరి , కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, మొక్కజొన్న , పత్తి వంటి పలు వాణిజ్య పంటల రైతులు నష్టపోయారు'' అని అన్నారు. 

''వరదలతో ఆరుగాలం శ్రమించి పండిచిన పంట నష్టపోయి రైతులు కన్నీళ్లలో ఉంటే వైసీపీ నేతలు మాత్రం ఇళ్లలో ఉండటం సిగ్గుచేటు. మంత్రులు గానీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు గానీ ఎందుకు వరద ప్రాంతాల్లో పర్యటించలేదు? మునిగిపోయిన పంటలను ఎందుకు పరిశీలించకుండా ఇళ్లకే పరిమితమయ్యారు? రైతుల సమస్యలు వారికి పట్టవా?'' అని ప్రశ్నించారు. 

read more  ప్రధాని మోదీ ఫోన్ చేస్తేనే జగన్ అవన్నీ.. ఇప్పుడు ఇదికూడా: అయ్యన్న సంచలనం

''ప్రకృతి విపత్తుల కింద నష్టపోయిన వివిధ పంటలకు టీడీపీ ప్రభుత్వం నష్టపరిహారాన్ని సుమారు 50 నుంచి 100 శాతం వరకు పెంచడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం కేవలం 15 శాతం పెంపునకే పరిమితమయ్యింది. టీడీపీ 5 ఏళ్ల పాలనలో ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులకు ఇనుపుట్ సబ్సిడీ  కింద 40 లక్షల మంది రైతులకు మొత్తం రూ. 3,759.51 కోట్లు విడుదల చేయడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 జూన్ నుంచి 2020 జనవరి వరకు కేవలం రూ. 25 లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. తాను అధికారం లోకి వస్తే ఇనుపుట్ సబ్సిడీ బకాయిలు రూ.2 వేల కోట్లు చెల్లిస్తామని చెప్పిన జగన్ మాట తప్పి రైతులను మోసం చేసారు'' అని విమర్శించారు. 

''వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలి కొదిలింది. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందటం లేదు, పండిచిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. 3 వేల కోట్ల రూపాయల తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంటే మరో వైపు మద్దతు ధర లేక రైతులు పండించిన పంటను రోడ్లపై పారబోస్తున్నారు. వైసీపీ పాలనలో  ఎరువులు, విత్తనాలు అధిక ధరకు కొని అప్పులపాలవ్వుతున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''గత ప్రభుత్వం సబ్సిడీ కింద రైతులకు డ్రిప్పులు అందజేస్తే వైసీపీ ప్రభుత్వం దాన్ని నీరుగార్చుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుపోవడం సరికాదు. ప్రభుత్వం  వెంటనే తగు చర్యలు చేపట్టి పంట నష్టం అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించాలి. రైతుల్ని తక్షణమే ఆదుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులపై దృష్టిపెట్టి వారి సంక్షేమానికి కృషి చేయాలి'' అని కళా వెంకట్రావు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios