అమరావతి: సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రికార్డులకెక్కారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో  మాట తప్పను.. మడమ తిప్పను అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పడం మడమ తిప్పడమే ఏకైక అజెండాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మాట తప్పడంలో మడమ తిప్పడంలో తమకు సాటెవరూ లేరు అనే రీతిలో ప్రజల్ని వంచిస్తున్నారని మండిపడ్డారు.

''అందరికీ షరతుల్లేకుండా అందాల్సిన సంక్షేమ పథకాలను సవాలక్ష ఆంక్షలతో, షరతులతో సంక్షేమ పథకం అంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి తెచ్చారు. ఎన్నికలకు ముందు ప్రతి పిల్లవాడికీ అమ్మఒడి అని ప్రకటించి అధికారంలోకి వచ్చాక వంచించారు. 45 ఏళ్లకే పెన్షన్ అని ఊరూరూ తిరిగి ప్రచారం చేసి.. చివరికి తూచ్ అన్నారు. సన్నబియ్యం హామీపై అసెంబ్లీ సాక్షిగా మాట మార్చారు. వాహన మిత్రను యజమానులకు పరిమితం చేసి డ్రైవర్లను మోసగించారు. అన్న క్యాంటీన్లను నిలిపివేసి పేదలు ఆకలి కేకలు వేసేలా చేశారు. సంక్షేమం హామీలతో బడుగు బలహీన వర్గాలను రోడ్డున పడేశారు, సంక్షేమాన్ని పక్కన పెట్టి సంక్షోభం సృష్టిస్తున్నారు'' అంటూ విరుచుకుపడ్డారు. 

''మీ రాజకీయ మనుగడ, ఆస్తులు కూడబెట్టుకోవడంపై పట్టిన శ్రద్ధ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిపై పెట్టడం లేదు. సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ. దాన్ని పక్కన పడేసి ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు. కరోనా విలయతాండవం, ఉపాధి లేదు, ఆదాయం లేదు. ప్రజలు అవస్థలు పడుతున్న సమయంలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచి రూ.60 వేల కోట్లకు పైగా భారం మోపారు'' అని ఆరోపించారు.

read more   జగన్ 151సీట్లు గెలుచుకోడానికి కారకులు వారే...కానీ ఇప్పుడు..: నిమ్మల హెచ్చరిక

''సంక్షేమ పథకాలతో ఆదుకోవాల్సిన సమయంలో ఆర్ధిక భారాలు మోపి.. ప్రజల బతుకుల కంటే ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి పెట్టడం సంక్షేమమా? ఆకలి అన్న వాడికి లేదు అనకుండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలతో ఆకలి కేకలు పెట్టించడం సంక్షేమమా? ఏది సంక్షేమమో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి'' అని ప్రశ్నించారు. 

''తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పుట్టుక నుండి గిట్టుక వరకు ఒక నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం అమలు చేసిన సంక్షేమ పథకాలను నిలిపివేశారు. పెళ్లి కానుకలను రూ.లక్షకు పెంచుతున్నామని ఆర్భాటంగా ప్రకటించి 15 నెలల పాలనలో ఒక్కటంటే ఒక్కరికి కూడా మంజూరు చేయకుండా పెళ్లి కానుక అనే పదమే వినిపించకుండా చేశారు. గిరిజన గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడమే ధ్యేయంగా చేపట్టిన ఫుడ్ బాస్కెట్ పథకాన్ని నిలిపేసి.. వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు'' అని మండిపడ్డారు. 

''పండగ కానుకలు, జీవన బీమా, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, నిరుద్యోగ భృతి, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రైతు రథం, అమృత హస్తం, దివ్యదర్శనం, మహాప్రస్థానం వంటి ఎన్నో ప్రజోపయోగ సంక్షేమ పథకాలను రద్దు చేసి సంక్షేమానికి ఎంతో చేశామని, చేస్తున్నామని ముఖ్యమంత్రి సహా వైసీపీ నేతలు ప్రకటించుకోవడం సిగ్గుచేటు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలనే సక్రమంగా అమలు చేయడం ముమ్మాటికీ ప్రజలను వంచించడమే. ద్రోహం చేయడమే'' అంటూ కళా వెంకట్రావు నిలదీశారు.