గుంటూరు: అదికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ ప్రజలను అబద్ధాలతో ఎంతలా నమ్మించి మోసగిస్తాడో ఈ 15నెలల పాలనలోనే అర్థమైందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. 

బుధవారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. మాటతప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తన పాలనావైపల్యాలతో అనేకసార్లు ఇప్పటికే మాటతప్పాడన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు, యువతను మోసగించినందుకు జగన్ వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. 

ప్రతిపక్షంలోఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో, పార్టీ మేనిఫెస్టోలో, తన మీడియాలో 45ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు నెలకు రూ.3వేలు పింఛను ఇస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు దాన్నెందుకు అమలుచేయడం లేదన్నారు. ఆనాడు ఓట్లు దండుకోవడానికి అడ్డగోలుగా హామీలిచ్చిన జగన్ ఇప్పుడు వాటిని తుంగలో తొక్కుతూ అరకొర సాయంతో అన్ని వర్గాలను మోసగిస్తున్నాడని నిమ్మల దుయ్యబట్టారు. 

జగన్ హామీ ప్రకారం 45ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.3వేల చొప్పున పింఛన్ ఇస్తే సంవత్సరానికి రూ.36వేలు, 5ఏళ్లకు రూ.లక్షా80వేలు చెల్లించాల్సి ఉందన్నారు. అది కాదని ఇప్పుడేదో వైఎస్సార్ చేయూత పేరుతో మహిళలను ఆదుకుంటున్నామని జగన్ డబ్బాలు కొట్టుకుంటున్నాడని, ఏడాదికి రూ.75వేలు ఇస్తానని చెబుతున్నాడని నిమ్మల మండిపడ్డారు. జగన్ తన హామీని కాదని, చేయూత పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.లక్షా5వేల వరకు నష్టం చేకూరుస్తున్నాడన్నారు. జగన్ మాట తప్పడం వల్ల ఒక్కో మహిళకు రూ.లక్షా5వేలు నష్టం కలుగుతోందన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను కల్లబొల్లి మాటలతో మోసగించినందుకు జగన్ వారికి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని రామానాయుడు డిమాండ్ చేశారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయైనా స్వయం ఉపాధిరుణం గానీ, వారి చదువుకు ఒక్కపైసా గానీ కేటాయించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వం వాటికింద ఉన్న నిధులను కూడా పక్కదారి పట్టించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ కింద ఉన్న నిధులన్నింటినీ జగన్ అధికారంలోకి రాగానే వేరే పథకాలకు మళ్లించాడన్నారు. 

read more  నీటిపారుదల ప్రాజెక్టులపైనా కోవిడ్ ప్రభావం...: సీఎంకు వివరించిన అధికారులు

తన నియోజకవర్గంలో రూ.175కోట్లను 5ఏళ్లలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, సబ్ ప్లాన్ కింద ఖర్చు చేసినట్లు నిమ్మల తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు, దళితులకు చిన్నాచితకా పదవులను బిస్కెట్లలా విసిరేస్తున్న జగన్  ప్రభుత్వం, కీలకమైన పదవులను మాత్రం తన వర్గం వారికే కట్టబెడుతున్నాడన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, కేబినెట్ ర్యాంక్ పదవులు, టీటీడీ ఛైర్మన్ వంటివాటిని తన వర్గానికే జగన్ కట్టబెట్టింది నిజం కాదా? అని నిమ్మల నిలదీశారు.  

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలపై దాడులు కూడా జగన్ పాలనలో పెరిగాయన్నారు. జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, మాజీఎంపీ హర్షకుమార్, జస్టిస్ రామకృష్ణ, వరప్రసాద్, కిరణ్ కుమార్ వంటివారికి ఎలాంటి గతి పట్టిందో గమనించాలన్నారు. జస్టిస్ రామకృష్ణను వాడువీడు అని నీచంగా సంబోధించిన మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోని జగన్ ప్రభుత్వం, టీడీపీ నేత జే.సీ.ప్రభాకర్ రెడ్డిపై మాత్రం తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసిందని నిమ్మల మండిపడ్డారు. 

జగన్మోహన్ రెడ్డి తన అక్కచెల్లెళ్లను ఎందుకు మోసగించాడో, రాష్ట్రంలోని మహిళలకు సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి, ఆయావర్గాల సబ్ ప్లాన్ నిధులను మింగేసినందుకు జగన్ వారికి బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలన్నారు. జగన్ కు 151 సీట్లు రావడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే కారణమని... కానీ ఆయన అధికారంలోకి వచ్చాక వారికే తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఆయా వర్గాలన్నీ చంద్రబాబు హయాంలో తలెత్తుకొని గర్వంగా జీవిస్తే జగన్ పాలనలో గొంతెత్తే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. భవిష్యత్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే జగన్ ప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధి చెబుతారని  నిమ్మల హెచ్చరించారు.