కాకినాడ ప్రచారంలో పాల్గోన్న చంద్రబాబు హామీల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి.
మరో మూడు రోజుల్లో కాకినాడ మున్సిపల్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం చంద్రబాబు అక్కడ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడపై ప్రశంసల వర్షం కురిపించారు. కాకినాడ ప్రణాళిక ప్రకారం నిర్మించిన నగరం అని, స్మార్ట్ సిటీకి కావాల్సిన అన్ని అర్హతలు ఈ నగరానికి ఉన్నాయన్నారు. త్వరలోనే కాకినాడకు మరో పోర్ట్ రాబోతుందన్నారు.
విశాఖ నుంచి కాకినాడకు ఇండస్ట్రీయల్ కారిడార్ ను నిర్మిస్తామని, పెట్రో కెమికల్ కారిడార్ కు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అది వస్తే.. కాకినాడ దశ మారుతుందన్నారు. అంతేకాకుండా నగరంలో లాజిస్టిక్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కాకినాడ నుంచి పాండిచ్చేరికి జలరవాణా మార్గం ఏర్పాటుచేస్తామన్నారు. బకింగ్‌హామ్ కెనాల్‌తో కాకినాడకు పూర్వవైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 250 కోట్లతో ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తామని తెలిపారు.
అదేవిధంగా ప్రతీ పేదవారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. నగరంలో ఫారిన్ ట్రేడ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీపైనా విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమన్న సీఎం.. వైసీపీ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు చేసే వారికి ఓట్లు వేస్తారా? అంటూ వైసీపీ నేతలనుద్దేశించి ప్రజలను ప్రశ్నించారు.
