టీడీపీ నేత వనమాడి వెంకటేశ్వరావు (కొండబాబు) పై విరుచుకుపడ్డారు కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి కాకినాడ రావటం మా అదృష్టమన్నారు.

చోళంగి, పటవలలో కొందరికి ఇళ్లపట్టాలు ఇస్తున్నామని.. రానివారు అందరూ మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వనమాడి అనుచరులు కోర్టుకు వెళ్లడం దురదృష్టకరమని ద్వారంపూడి అన్నారు.

గతంలో చంద్రబాబు కాకినాడ వచ్చి , వెళ్లినప్పుడు తామెప్పుడూ మీడియా ముందుకు రాలేదని ఆయన గుర్తుచేశారు. కాకినాడకు ఎప్పుడూ సునామీ రాలేదు, రాదన్నారు. ప్రజలను దయచేసి భయభ్రాంతులకు గురిచేయొద్దని.. కాకినాడ నుంచి వలసపాకాల, కొమరగిరిలో స్థలాలను తీసుకున్నామని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.

కులం, మతం చూడకుండా అందరికీ న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు వాగితే మర్యాదగా వుండదని కొండబాబుకు వార్నింగ్ ఇచ్చారు.

నీలా తాము ట్యాక్స్ ఎగ్గొట్టలేదని... 45 ఎకరాలకు నువ్వు లెక్క చెప్పాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు. జగన్నాథపురం 3వ బ్రిడ్జి ప్రజల కోసం కాదని.. తన సొంత లాభం కోసమేని ఆయన ఎద్దేవా చేశారు.

కాకినాడ స్మార్ట్ సిటీ నిధులను కొండబాబు దోచుకున్నారని.. ఆయన అవినీతి, అక్రమాలు చాలా వున్నాయని అన్ని బయటపెడతామని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. నెహ్రూ విగ్రహం తొలగింపు ప్రైవేట్ వ్యవహరమని, విగ్రహం రాజా ట్యాంక్‌లో పెడతామని ఆయన వెల్లడించారు.