అమరావతి: రాష్ట్రంలోని అడవులను నాశనం చేస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లపై ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రం నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ కాకుండా చూడటంతో పాటు ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు తరలిన ఎర్రచందనాన్ని కూడా పట్టుకుంటున్నారు. ఇలా తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఎర్ర చందనం మాఫియా ముఠాలపై కడప ప్రత్యేక పోలీసు బృందాలు మెరుపు దాడులు చేశారు. 

పక్కా సమాచారంతో బెంగళూరు చేరుకున్న కడప పోలీసులు అక్కడి పోలీసుల సాయంతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు బడా స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద భారీమొత్తంలో ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బడా స్మగ్లర్లు కడప, మైదుకూరు, కోడూరులలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు సమాచారం. స్మగ్లర్లను పోలీసులు జిల్లాకు తీసుకురానున్నారు.

మరోవైపు కృష్ణా జిల్లాలో 120 కేజీల గంజాయిని పట్టుకున్నారు కంచికచర్ల పోలీసులు. దోనబండ చెక్ పోస్ట్ వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు  డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ గంజాయిని విశాఖ జిల్లా నర్సిపట్నం నుంచి ముంబై కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. 

రెండు కార్లలో 120 కేజీల గంజాయి తరలిస్తున్న సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు కంచికచర్ల పోలీసులు తెలిపారు. ఇలా గంజాయి తరలిస్తున్న ముగ్గురు పురుషులు,
 ఓ మహిళను అరెస్టు చేసినట్లు...వారివద్ద గల 5 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.