వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, సీఎం జగన్మోహన్ రెడ్డి  సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డి కరోనా బారినపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కార్యక్రమాల సందర్భంగా కడప జిల్లాలో సెప్టెంబర్ 1,2 తేదీల్లో జగన్ పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు పరీక్షలు నిర్వహించగా అవినాశ్ రెడ్డికి పాజిటివ్‌గా తేలింది. తనకు కరోనా నిర్థారణ కావడంతో ఆయన వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు.

అయితే కొద్దిరోజులుగా వివిధ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఇదే సమయంలో ఎంపీ అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులకు కరోనా సోకింది.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. అయితే కరోనా లక్షణాలు లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయన హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. 

తనకు కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగ్గిరెడ్డి తెలిపారు. నెగెటివ్ వచ్చే వరకు తనను ఎవరూ పరామర్శించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే గత కొద్దిరోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని జగ్గిరెడ్డి సూచించారు.