ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ తెలియని తెలుగు జనాలు లేరంటే అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో ఒక్క సీటు లేకున్నప్పటికీ, ఆయన ఫుల్ టైం రాజకీయాలు చేయకున్నప్పటికీ, జాతీయస్థాయిలో ఏ పార్టీతోనే పొత్తులేకున్నప్పటికీ... ఆయనెప్పుడూ కూడా హాట్ టాపికే! అది ఆయన పాపులారిటీ. 

ప్రతిపక్షంలో ఉన్నవారు సాధారణంగా అధికారంలో ఉన్నవారిపై విరుచుకుపడతారు, కానీ ఏమయిందో ఏమో కానీ.... ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు మన పాల్ గారు. ప్రజలారా బుద్ధి చెప్పండి పవన్ కళ్యాణ్ కి అంటూ అతనికేదో శాసనసభలో మెజారిటీ ఉన్నట్టు, ఆయనేదో అధికారంలో ఉన్నట్టుగా ఫైర్ అవుతున్నాడు పాల్. 

"తమ్ముడూ పవన్ కళ్యాణ్.. నువ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్‌గా ఉండు.. నేను డబ్బు తీసుకుని వస్తాను అంటే నా మాట విన్నావా? అసలు ఎమ్మెల్యే అవకుండానే ఇన్ని పార్టీలు మారిన నాయకుడ్ని నిన్నే చూసాను, అందుకే ఆ పిచ్చోడు నీ అరాచకాలపై సినిమా కూడా తీశాడు అంటూ తాండవమాడాడు కే ఏ పాల్.

పవన్ కళ్యాణ్‌కి ఇంకా సిగ్గురాలేదు.. వాళ్ల అన్నయ్య అంటే 18 సీట్లు గెలిచాడు. పాలకొల్లులో చిత్తుగా ఓడిపోయినా.. తిరుపతిలో గెలిచాడు. ఇలాంటి వారి వల్ల 25 శాతం ఉన్న కాపులకు తీవ్ర నష్టం జరుగుతుందని పాల్ వ్యాఖ్యలు చేసాడు. 

85 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి తీరని నష్టం అని తాను ఆనాడే చెప్పానని, అన్నట్టుగానే ఆ తరువాత చిరంజీవి కాంగ్రెస్‌లో కలిసిపోయాడని పాల్ అన్నాడు. 

'తమ్ముడా పవన్ కళ్యాణ్!! రా.. మనం కలిసి పనిచేద్దాం.. లేదంటే నువ్వొకచోట చోట కూడా గెలవ లేవు' అని అప్పుడే చెప్పానని గుర్తు చేసాడు పాల్. 

పవన్ కి నీతి నిజాయితీ ఉంటే రమ్మని చెప్పానని, కాని 2014లో బీజేపీ-టీడీపీకి ప్రచారం చేసి.. అప్పుడు మతతత్వ పార్టీలంటూ కమ్యునల్ పార్టీలని తిట్టి.. తిరిగి మాయావతి కాళ్లపై పడ్డాడని పాల్ వ్యాఖ్యానించాడు. 

గత ఎన్నికల్లో కమ్యూనిస్టులను పొగిడి ఇప్పుడు అధికారం కోసం బీజేపీతో చేరవా అంటూ ఎద్దేవా చేసాడు. ఇలా ఒకమాట మీద నిలబడకపోవడం వల్లే పేరు కూడా చెప్పలేని ఒక షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్న పిచ్చోడు నీ పైన సినిమా తీసాడంటూ పాల్ సెటైర్లు వేసాడు. 

25 శాతం కాపులుంటే వారిలో రెండు శాతం ఓట్లు కూడా పవన్ కి పడలేదని, మొత్తంగా నాలుగు పార్టీలను కలుపుకుపోయినా 5-6 పెర్సెంట్ ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తుచేశారు. 

తమ్ముడూ పవన్ కళ్యాణ్ అందరి చేతా ఛీ అని ఎందుకు అనిపించుకుంటావు అని అంటూనే... అన్న కంటే తమ్ముడు ఇంతిలా దిగజారిపోవడానికి సిగ్గుగా లేదా? అంటూ పాల్ ప్రశ్నించాడు. 

అన్న చిరంజీవేమో... కాంగ్రెస్ అయిపోయింది, ఇక ఇప్పుడు తమ్ముడు బీజేపీతో ఉంటే ఆస్తుల్ని కాపాడుకోవచ్చు.. తమ్ముడు ముఖ్యమంత్రి అయితే ఈయనకు కూడా పదవులు వస్తాయని అన్నింటికి సిద్దపడిపోయాడు చిరంజీవి అని, ఇలా తాను మాట్లాడకూడదు కాని.. బాధతో ఆత్మ వేదనతో మాట్లాడాల్సి వస్తుందని అన్నాడు పాల్. 

"తమ్ముడూ పవన్ కళ్యాణ్.. నువ్ యాక్టింగ్ సీఎంగా ఉండు, నేను డబ్బులు తెస్తాను  అని చెప్పాను, నా మాట విన్నావా?, అంతెందుకు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మాట విన్నావా?, నీ జనరల్ సెక్రటరీ మాట విన్నావా?, కమలాకర్ గారి మాట విన్నావా?, ఎంతమంది చెప్పినా వినలేదు. నీకు అంత పదవీ దాహం ఎందుకో అర్థం కావడం లేదు" అంటూ పాల్ పావనము పై ఫైర్ అయ్యాడు. 

బీజేపీతో ఉన్నంత కాలం పవన్ లైఫ్‌లో ముఖ్యమంత్రి కాలేడని, అసలు ఎప్పటికీ కాలేడని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని పవన్ మారాలని, లేదంటే ఆ డాన్స్‌లు వేసుకుని సినిమాలకు పోవాలని, రాజకీయాల్లో ఉండి ప్రజలకు అన్యాయం చేయడం ఎందుకని పాల్ విమర్శించారు. 

ఎమ్మెల్యే అవ్వకముందే ఇన్ని పార్టీలు మారిన పవన్ కళ్యాణ్... ఎమ్మెల్యే అయితే ఇంకేంన్ని పార్టీలు మారతాడో, ఇంకెన్ని వేషాలు వేస్తాడో, ప్రజలారా అందరూ కలిసి బుద్ధి చెప్పండి అంటూ పాల్ పవన్ పై శివాలెత్తారు.