హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీ బహిరంగ సభలకు అనుమతులు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

అలాగే ఆయా ఛానెల్స్ లలో తన ఇంటర్వ్యూలు టెలికాస్ట్ కాకుండా చంద్రబాబు నాయుడు అడ్డంపడుతున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. 

గతంలో తనను దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. కైకలూరు సభలో 500 మంది పోలీసులతో తనను అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో 50 సార్లు తనను అరెస్ట్ చేశారని అయినా తనను ఆపగలిగారా అంటూ ప్రశ్నించారు. 

తనను ఇబ్బందుల పాల్జేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందా అంటూ చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో భూస్థాపితం కాలేదా అని ప్రశ్నించారు. తాను గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూ స్థాపితం అయిపోతుందని చెప్పానని అలాగే అయిపోయిందన్నారు. 

ఇకనైనా చంద్రబాబు నాయుడు తన సభలను అడ్డుకోకుండా అనుమతులు ఇవ్వాలని లేని పక్షంలో తానేంటో చూపిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కేవలం తన వల్లే అవుతుందన్నారు. 

చంద్రబాబు నాయుడు వల్ల రుణమాఫీ జరగదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు భూ కబ్జాలు మాత్రమే చేస్తారని రైతులను పట్టించుకోరన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3లక్షల కోట్లతో రుణమాఫీ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.   

ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు, వైఎస్ జగన్ కు ఓటేసే పరిస్థితి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన పాలనను కావాలనుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు, జగన్ లను తనతో పోల్చి ఎవరు నిజాయితీపరులు, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తే తన పేరే చెప్తారని కేఏపాల్ చెప్పుకొచ్చారు. 

ఈనెల 26న విజయవాడలో ప్రజాశాంతి పార్టీ నేతలతో సమావేశం ఉందని అదేరోజు సాయంత్రం గుంటూరులో కో ఆర్డినేటర్స్ తో సమావేశం ఉందని స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కల్యాణ్ కు కెఎ పాల్ ఆఫర్: వంగవీటి రాధాకు భరోసా