హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చెయ్యడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. వంగవీటి రాధా వైసీపీని వీడి మంచి పని చేశారన్నారు. అయితే రాజకీయ భవితవ్యంపై ఎలాంటి ఆందోళన చెందొద్దు అన్నారు. రాధాకృష్ణ రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటికిపైకి తీసుకు రావాలని కోరారు. 

వంగవీటి రాధా కోసం తాను విన్నానని ఆయన మంచి నాయకుడు అన్నారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత రాధా తెలుగుదేశం పార్టీలోకి చేరతారంటూ వార్తలు వస్తున్నాయని టీడీపీలోకి వెళ్లేముందు గతాన్ని తలచుకోవాలని సూచించారు. 

వంగవీటి మోహన్ రంగాను ఎవరు చంపారు...ఏ పార్టీ చంపిందో తెలుసుకోవాలన్నారు. రాధా కృష్ణ టీడీపీలో చేరితే కాపు సామాజకి వర్గం సహించబోదన్నారు. కాపులంతా ఐక్యంగా ఉండాలని వంగవీటి మోహన్ రంగాను ఎవరైతే చంపారో వారికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.  

జనసేన అధినేత పవన్న కళ్యాణ్ కు తాను ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికలలో కలిసి పనిచేద్దామని ఐదు లేదా పది లేదంటే 15 ఎన్నిసీట్లు కావాలో తీసుకోవాలని పవన్ కళ్యాణన్ కు సలహా ఇచ్చారు. తనకు ప్రస్తుతం ఏపీలో 38 శాతం ఓటు బ్యాంకు ఉందన్నారు. 

వంగవీటి రాధా తన గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. విజయవాడలో తన ఫోటో, చంద్రబాబు, జగన్ ఫోటోలు ప్రజలకు చూపించి ఎవరు నిజాయితీ పరులు ఎవరి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ప్రశ్నిస్తే తన పేరే చెప్తారని చెప్పుకొచ్చారు. ప్రజాశాంతి పార్టీలో 64 లక్షల మంది జాయిన్ అయ్యారని మరో పది రోజుల్లో కోటి మంది చేరబోతున్నారని కేఏపాల్ స్పష్టం చేశారు.