‘కాపు’ నివేదికపై బాంబు పేల్చిన మంజూనాధ

First Published 2, Dec 2017, 3:00 PM IST
Justice manjunatha says he will meet cm and submit report soon
Highlights
  • బిసి కమీషన్ ఛైర్మన్ శనివారం పెద్ద బాంబే పేల్చారు.

బిసి కమీషన్ ఛైర్మన్ శనివారం పెద్ద బాంబే పేల్చారు. తనకు తెలీకుండా, తనను సంప్రదించకుండానే కమీషన్ సభ్యులు ప్రభుత్వానికి రిపోర్టును అందచేశారంటూ మండిపడ్డారు. కాపులను బిసిల్లోకి చేర్చే అంశంపై అధ్యయనం చేయటానికి చంద్రబాబునాయుడు జస్టిస్ మంజూనాధ కమీషన్ ను నియమించింది. దాదాపు 20 నెలల అధ్యయనం తర్వాత కమీషన్ తన నివేదికను సిద్ధం చేసింది. అయితే, శుక్రవారం నాడు కమీషన్ లోని ముగ్గురు సభ్యులు చంద్రబాబును కలసి నివేదికను అందచేశారు. అదే నివేదికపై చంద్రబాబు శుక్రవారం మధ్యహ్నం జరిగిన టిడిఎల్పి, సాయంత్రం జరిగిన మంత్రివర్గంలో కూడా చర్చించారు.

నివేదికపై ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించి శనివారం ఉదయం అసెంబ్లీలో తీర్మానం కోసం ప్రవేశపెడుతోందని మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దాంతో కమీషన్ ఛైర్మన్ మంజూనాధ షాక్ కు గురయ్యారు. తాను చంద్రబాబును కలిసి నివేదికను ఇవ్వకుండానే ప్రభుత్వానికి నివేదిక ఎలా అందిందో అర్దంకాక మంజూనాధలో అయోమయం మొదలైంది. అయితే, మంజూనాధకు తెలియకుండానే కమీషన్ లోని ముగ్గురు సభ్యులు చంద్రబాబుకు నివేదికను ఎలా అందించారన్నది పెద్ద ప్రశ్న.

అదే విషయమై మంజూనాధ మీడియాతో మాట్లాడుతూ, కమీషన్ లోని సభ్యులు తనకు తెలీకుండానే సిఎంను కలిసి నివేదికను అందించారంటూ మండిపడ్డారు. నివేదికను అందించేందుకు సిఎంను కలుస్తున్నట్లు సభ్యులు తనకు చెప్పలేదని స్పష్టంగా ఛైర్మన్ చెబుతున్నారు. రిపోర్టును ప్రభుత్వానికి అందచేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సభ్యులు అందించిన నివేదికలో ఏముందో తనకు అనవసరమని, తాను సిద్ధం చేసిన రిపోర్టుతో త్వరలోనే చంద్రబాబును కలుస్తానని చెప్పటంతో సర్వత్రా అయోమయం మొదలైంది. ఇదే విషయమై మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, కమీషన్ నివేదిక  ఇవ్వటంలో ఛైర్మన్ మంజూనాధ బాగా జాప్యం చేస్తున్నట్లు చెప్పారు. కమీషన్ లోని నలుగురు సభ్యుల్లో ముగ్గురు సిఎంను కలిసి నివేదిక ఇచ్చినట్లు తెలిపారు

loader