హైదరాబాద్: తన పొలిటికల్ ఎంట్రీపై సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. మీలో ఎవరు కోటీశ్వరులు షో ప్రోమో విడుదల సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మీడియా ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రశ్నకు ఆయన స్పందించారు. మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని అడిగిన ప్రశ్నకు మీరే జవాబు చెప్పాలి, మీకు తెలుసు అని అన్నారు. ఎన్టీఆర్ కావాలి, రావాలి అంటున్నారు అని అన్నప్పుడు దానిపై మాట్లాడేందుకు ఇది సమయం కాదు, సందర్భం కాదని ఎన్టీఆర్ అన్నారు. 

రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి మాట్లాడుకుందామని అన్నారు వేడివేడి కాఫీ తాగుతూ దానిపై మాట్లాడుకుందామని ఆయన అన్నారు. మీలో ఎవరు కోటీశ్వరులుపై వచ్చిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమంలో పలురకాలైన భావోద్వేగాలు ఉంటాయని ఆయన చెప్పారు. మీలో ఎవరు కోటీశ్వరులు అనేది మనీ కోసం కాదని, మనీ సెక్యూరిటీ ఇస్తుందని, ఏ విధమైన సక్సెస్ ఇది ఇస్తుందనేది ముఖ్యమని ఆయన అన్నారు. 

మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమంలో విశ్వాసాన్ని పెంచుతుందని, షో దాన్ని తెలియజేస్తుందని, ఎన్ని డబ్బులు తీసుకుని వెళ్తున్నావనేది ముఖ్యం కాదనీ ఎంత ఆత్మవిశ్వాసాన్ని పొందావనేది ముఖ్యమని, దాన్ని షో తెలియజేస్తుందని ఆయన అన్నారు. అపజయం కూడా విశ్వాసాన్ని పెంచుతుందని, మరోసారి విజయాన్ని సాధించడానికి అది విశ్వాసాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. 

రామారావుగా మీరు ప్రమోట్ అయ్యారా అని అడిగితే.. చిన్నప్పుడు ఓ పేరుతో పిలిచేదని, తన భార్య ముద్దుగా ఓ పేరుతో పిలుస్తుందని, తన పిల్లలు నాన్నా అని పిలుస్తారని, ఎవరు ఏ పేరుతో ప్రేమగా పిలిచినా పలుకుతానని, ప్రేమతో పిలిస్తే పలుకుతానని ఆయన అన్నారు.