ఒంగోలు: సినీ హీరో, నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మరోసారి కలకలం సృష్టించారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావన లేకుండా టీడీపీ రాజకీయాల గురించి మాట్లాడడం తరుచుగా జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారిన స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మరోసారి తెర మీదికి వచ్చింది. 

జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీ ఒకటి టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో చర్చకు పాదులు వేసింది. ఏపీకి తదుపరి సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఆ ఫ్లెక్సీ వెలిసింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నెలకొల్పిన ఫ్లెక్సీ ఆ విధమైన వ్యాఖ్య ఉంది. 

ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో పాటు టీడీపీ నేతల ఫొటోలు ఉన్నాయి. దాంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అది చర్చకు దారి తీసింది. ఆ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారనే విషయంపై చర్చ సాగుతోంది.

చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.  సినిమాల్లో ఆయన బీజీగా ఉన్నారు. చాలా కాలంగా ఆయన రాజకీయాల గురించి కూడా మాట్లాడడం లేదు. తన తనయుడు నారా లోకేష్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారనే అభిప్రాయం ఉంది. 

అయితే, తన తాత స్థాపించిన టీడీపీ కోసం తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో చెప్పారు. అయినా కూడా చంద్రబాబు ఆయనకు ఏ విధమైన పాత్రను కూడా ఇవ్వలేదు.