రోజు రోజుకీ సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైనా కనపడకుండా పోతోంది. ఓ వైపు కరోనా మహమ్మారి  దేశంలో విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా.. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా సోకి చనిపోయిన రోగుల ఒంటి మీద నుంచి బంగారు నగలను చోరీ చేశారు. ఈ సంఘటన తిరుపతిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపతి స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో మృతదేహాలపై బంగారు ఆభరణాలు చోరీలకు గురౌతున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది తాళిబొట్టు, గొలుసులు, ఉంగరాలు చోరీలకు గురౌతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆభరణాలు చోరీ ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటామని  హామీ ఇచ్చారు. అయినప్పటికీ.. ఈ ఘటనలు మాత్రం ఆగడం లేదు.

తాజాగా.. కరోనా రోగి మృతదేహం పై ఉన్న రెండు బంగారు ఉంగరాలు చోరీ చేశారు. చివరి చూపు కోసం మార్చురీ వద్దకు వచ్చిన కుటుంబసభ్యులు బంగారు ఉంగరాలు కనిపించకపోవడంతో ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. 

కాగా.. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లికి  చెందిన వెంకటరత్నం నాయుడికి కరోనా సోకింది. ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో చేర్పించగా.. ఈ నెల 23న మృతి చెందాడు.  కాగా.. ఆయన చనిపోగానే.. ఆయన శరీరంపైన రెండు బంగారు ఉంగరాలను ఆస్పత్రి వార్డు బాయ్ లాక్కోవడం గమనార్హం. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.