తాడిపత్రి జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. జెసి బ్రదర్స్ ఏమి మాట్లాడినా అసలేమీ మాట్లాడకపోయినా సంచలనమే. అటువంటిది ప్రభాకర్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోయేది లేదని స్పష్టంగా ప్రకటించారు. తన కుమారుడు అస్మిత్ రెడ్డి ఎంఎల్ఏగా పోటీ చేస్తారని చెప్పారు. తనకు ఆరోగ్యం కూడా సహకరించటం లేదన్నారు.

అనారోగ్యం కారణంగా నియోజకవర్గమంతా తిరిగలేకుండా ఉన్నట్లు చెప్పారు. ఉత్స విగ్రహంలాగ ఊరికే కూర్చునే బదులు యాక్టివ్ రాజకీయాల నుండి రిటైర్ అవ్వటమే మేలని చెప్పారు. కాకపోతే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్పిలర్ గా పోటీ చేస్తానని చెప్పటం సంచలనంగా మారింది.

గతంలో ఇదే విషయమై అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నకల్లో ఎంపిగా తాను పోటీ చేయటం లేదని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తనకు బదులుగా కుమారుడు జెసి పవన్ రెడ్డిని పోటీ చేయించాలని అనుకుంటున్నారు. అయితే చంద్రబాబునాయుడు టిక్కెట్టు ఇస్తేనే. తాజాగా ప్రభాకర్ రెడ్డ ప్రకటన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో సోదరులిద్దరూ ఒకేసారి ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో కొడుకుల కోసం వీరిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు జిల్లాలో ప్రచారం కూడా జరుగుతోంది. చివరికేం జరుగుతుందో చూడాలి.