అనంతపురం: తన తమ్ముడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై అనంతపురం టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద సెటైర్లు వేశారు. రాజ్యాంగం లేదు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆఫీసర్లందరికీ నడుములు విరిగిపోయాయని అన్నారు. 

మనం ఎవరినీ ఏమీ అనాల్సిన అవసరం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. పెద్ద మనిషికి ఏసు క్రీస్తు లేడు, శివయ్య లేడు, ఏడుకొండలవాడు లేడు, అల్లా అంతకన్నా లేడు అని ఆయన వైఎస్ జగన్ ను ఉద్దేశించి అన్నారు. సంపన్నుడు నాలుగేళ్లు అధికారంలో ఉంటాడని, ఈ నాలుగేళ్లు ఎవరికి ఏమవుతుందో తెలియదని ఆయన అన్నారు. 

Also Read: జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్.. జగన్ పై మండిపడ్డ లోకేష్

అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల మాట జగన్ వినడని ఆయన అన్నారు. అందరూ డూడూ బసవన్నలు అయిపోయారని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వంలో నిరసనలు తెలియజేయడం బుద్ధిలేని తనమని ఆయన అన్నారు. నిరసనలను జగన్ పట్టించుకోడని ఆయన అన్నారు. ఈ నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తేల్చుకోవచ్చునని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. 

ఏం చేయలేని పరిస్థితిలో తాము ఉన్నామని ఆయన చెప్పారు. రాజు తలుకుంటే దెబ్బలకు కొదువా అని ఆయన అన్నారు, ఈ కేసు ఏమిటో తనకు తెలియదని ఆయన అన్నారు. ఈ కేసులోకి అస్మిత్ రెడ్డి పేరు ఎలా వచ్చిందో తెలియడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సరెండర్ అవుతానని ప్రభాకర్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తనకు తెలియదని ఆయన అన్నారు. 

Also Read: జగన్ ప్రతీకారేచ్ఛ: జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై చంద్రబాబు ఫైర్

ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని, నిరంతరం మాస్కు వేసుకుని ఉండాలని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టులు తనకేమీ ఆశ్చర్యమేమీ కలిగించలేదని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని ఆయన అన్నారు. కారు కొంటాం, ఎవడో ఎన్వోసీ ఇస్తాడు, అది దొంగ కారా, మంచి కారా అనేది ఎవడికి తెలుస్తుందని ఆయన అన్నారు. తమకు ఎన్ని బస్సులు, ఎన్ని లారీలు ఉన్నాయో తనకు తెలియదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జేసీ దివాకర్ రెడ్డిపై పెట్టిన కేసును తాను సమర్థించడం గానీ సమర్థించకపోవడం గానీ లేదని ఆయన అన్నారు. 

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడిని కూడా అరెస్టు చేశారు. వారిద్దరిని అనంతపురం పోలీసులు శనివారంనాడు హైదరాబాదులో అరెస్టు చేశారు. 

154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన కేసులో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇరువురిని పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టును పోలీసులు ధృవీకరించారు. అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి పనిచేశారు.